Idream media
Idream media
మంత్రి కొడాలి నాని సాహసోపేతమైన సవాలు విసిరారా..? ఆవేశంగా అనేశారా..? లేక ఆలోచించే చంద్రబాబుకు చాలెంజ్ విసిరారా..? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు కుప్పంలో రాజీనామా చేసి తిరిగి గెలిస్తే.. రాజకీయాలు వదిలేసి చంద్రబాబు బూట్లు తుడుస్తూ కూర్చుంటా అని పేర్కొన్న నాని సవాలుపై పెద్ద దుమారమే రేగుతోంది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితులు అలానే ఉన్నాయంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీలో అధికారంలోకి వచ్చారు. 175 స్థానాల్లో టీడీపీ 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు పనితీరు ప్రజలకు నచ్చలేదు. ఫలితంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిమితం అయింది. కుప్పంలో చంద్రబాబు మెజార్టీ కూడా తగ్గింది. అయితే.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, వచ్చే ఎన్నికల లోపు టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఆ పార్టీ పుంజుకోవడం మాట అటుంచి పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీ కోటకు బీటలు వారుతున్నాయి. బహుశా మంత్రి కొడాలి నాని అంత కాన్ఫిడెంట్‌గా సవాలు విసరడానికి అదే కారణం కావొచ్చు. అసలు ఈ సవాలుకు అసలు కారణం చంద్రబాబే. పరిషత్ ఎన్నికల్లో తాము ఎన్నికలను బహిష్కరించబట్టే వైఎస్సార్సీపీకి ఇన్ని స్థానాలు వచ్చాయని వాదిస్తున్న తెలుగుదేశం పార్టీ అదే సమయంలో అసెంబ్లీ రద్దు చేసి వస్తే పోటీకి వెళ్దామని సవాల్ విసిరింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సవాల్ విసిరారు. దీనికి వైఎస్సార్సీపీ ఘాటుగానే స్పందించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అయితే.. బాబు పరువు తీసేశారు.
‘‘తన డైరెక్షన్‌లో నిమ్మగడ్డ ఎన్నికలను ఆపుతాడని తెలిసే.. దొడ్డిదారిన ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికల నుంచి పారిపోయిన పిరికిపంద. అప్పటికే మున్సిపల్, పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 85 శాతం వైయస్సార్ సీపీ గెలిస్తే సింబల్ లేదని, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమాయకులని చెప్పి, ఓడిపోయిన, పనికిమాలిన పార్టీ తామే గెలిచామంటూ వాళ్ల ఆఫీస్ ముందు టపాకాయలు కాల్చుకున్నారు. చంద్రబాబు ఆరోజు సాయంత్రానికి ప్రెస్‌మీట్ పెట్టి ’81.3 శాతం నేను గెలిచా, 79.22శాతం నేను గెలిచా..‘ అంటూ పిచ్చిలెక్కలు చెప్పిన పరిస్థితిని చూశాం.
జగన్ మోహన్‌రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎక్కడా బయటకు రాలేదు. ఆయన చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులమీద నమ్మకం కావచ్చు. మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు దీవిస్తారు అనే నమ్మకంతో జగన్ మోహన్ రెడ్డిగారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు.
75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక మున్సిపాల్టీ గెలిచింది. పన్నెండు కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్ కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా గత ఎన్నికల కంటే వైసీపీ మెజార్టీ పెరిగింది. ఇంత స్పష్టంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని దేవుడు దీవిస్తుంటే చూడలేదని చంద్రబాబు, తాను ఎన్నికల్లో పోటీ చేయలేదని చేతకాని కబుర్లు చెబుతాడు.
టీడీపీ ఎన్నికలు బహిష్కరిస్తే.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ కూడా వైయస్సార్ సీపీకి టర్న్ అయిపోతుందా? నాలుగు జెడ్‌పీటీసీలను తీసుకుంటే కుప్పంలో 21 వేల ఓట్లు చంద్రబాబుకు వచ్చాయి. 80 వేలు చిల్లర వైయస్సార్‌సీపీకి వచ్చాయి, చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించాడు కాబట్టే ఆయన నియోజకవర్గంలోని కుప్పం ప్రజలంతా వైయస్సార్‌సీపీకి ఓటు వేశారా? 15 శాతం ఇతర పార్టీలు గెలిచారు. దానిలో పదిశాతం అంటే 900 ఎంపీటీసీలను టీడీపీ గెలుచుకుంది. వాళ్లంతా చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ, వినకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వారు టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులా? వాళ్లందరిని సస్పెండ్ చేస్తారా? వాళ్లంతా చంద్రబాబును ధిక్కరించి ఓటు చేసి గెలిచారా?’’ అంటూ ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించారు. చివరగా బాబు కుప్పంలో రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.