iDreamPost
android-app
ios-app

నాకు ఏ గుర్తు వద్దు.. కోదాడ స్వతంత్ర అభ్యర్థి వింత వినతి!

నాకు ఏ గుర్తు వద్దు.. కోదాడ స్వతంత్ర అభ్యర్థి వింత వినతి!

ఎన్నికల్లో అత్యంత కీలకమైనది గుర్తు. ఇప్పటికీ కొందరు పార్టీ అభ్యర్థి పేరు తెలియకపోయినా సరే.. తాము అభిమానించే పార్టీ గుర్తుకే ఓటేస్తుంటారు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్, టీడీపీ వంటి పార్టీలకు శాశ్వత గుర్తు ఉంటుంది. అందుకే ఆ పార్టీల పేర్లు చెప్పగానే తొలుత గుర్తుకు వచ్చేది ఆ పార్టీలకు కేటాయించిన గుర్తులే. అందుకే ఏదైనా పార్టీ రెండుగా చీలిన సందర్భాల్లో అప్పటి వరకు ఆ పార్టీకి కేటాయించిన గుర్తు కోసం చీలిక వర్గాలు పోటీ పడుతుంటాయి. అలానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే వారు కూడా గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు చేసుకుంటారు. కానీ ఓ అభ్యర్థి మాత్రం వింత వినతిని ఎన్నికల కమిషన్ కి తెలిపారు. తనకు ఏ గుర్తు కేటాయించ వద్దంటూ వింత కోరిక కోరాడు.

జలగం సుధీర్ కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఏ గుర్తూ వద్దని అంటున్నారు. అసలు ‘గుర్తు’ల కారణంగా స్వతంత్ర అభ్యర్థులకు నష్టం జరుగుతోందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి ఎన్నికల గుర్తు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇంకా ఆ లేఖలో పలు అంశాలను వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన ఇంకా ఎన్నికల గుర్తుల మీద ఆధారపడి పోటీ చేయడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎన్ఎఫ్ హెచ్ ఎస్-5 సర్వే ప్రకారం దేశంలో 72శాతం మంది మహిళలు, 84శాతం మంది పురుషులు అక్షరాస్యులుగా ఉన్నారని సుధీర్ తన లేఖలో తెలిపారు. 1968లో వచ్చిన గుర్తుల విధానం ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తీసివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ గుర్తులు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్టీలకు, ఆ పార్టీ నేతలకు మాత్రమే లాభం కల్పిస్తున్నాయని అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి స్వతంత్ర అభ్యర్థులుగా అడుగుపెట్టిన వారికి ‘గుర్తు’ ద్వారా అన్యాయం జరుగుతోందని సుధీర్ వివరించారు. మరి.. జలగం సుధీర్ తెలిపిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి