Idream media
Idream media
‘‘ప్రశంసించాల్సిన, అనుసరించాల్సిన ఆదర్శ నాయకురాలొకరు ఇన్నాళ్ళకు మనకు దొరికారు. ఇలాంటివారు మరింతమంది రావాలని కోరుకుందాం. అనసరమైన మాటలు లేవు. పనికిమాలిన పరిహాసాలు లేవు. మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారాలు లేవు. రాజకీయ అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆడే నాటకాలు లేవు. సామాజిక సేవలో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యక్తి. టీచర్! మీ నాయకత్వాన్ని కొనసాగించండి!’’ కరోనా విపత్తును ఎదుర్కోవడంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ చేపడుతున్న సమర్థమైన చర్యలను అభినందిస్తూ మలయాళ నటుడు అనూప్ మీనన్ గతంలో చేసిన ట్వీట్ ఇది.
కొవిడ్ వారియర్ లను అభినందిస్తూ గతేడాది ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఓ కార్యక్రమానికి దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ కేకే శైలజ. ఈ గుర్తింపు చాలు ఆమె కృషిని అర్థం చేసుకోవడానికి. ఆపద సమయంలో ఆమె ప్రజలకు అండగా ఉన్నారు. కరోనా వైరస్ అంటే తెలియని రోజుల్లో ఆమె ప్రజల్లోని భయాందోళనలను పారద్రోలారు. మహమ్మారి నియంత్రణకు నడుం బిగించారు. కేరళలో కరోనా వైరస్ నిర్ధారణ అయిన తొలి వ్యక్తిని శైలజ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. అంతేకాదు.. పాలనలో సామాన్య ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే పనితీరును ఆమె ప్రవేశపెట్టారు. ప్రజలు నేరుగా తనతో మాట్లాడి సందేహాలు తీర్చుకొనే వీలు కల్పించారు. ఇలా కేరళలోని పినరయి విజయన్ గత కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేకే శైలజ ప్రజల్లో గుర్తింపు పొందారు. అందుకే తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆమెను బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నారు.
పినరయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కేరళ లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను 99 సీట్లను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. సీఎం పినరయి విజయన్ ఆయన కేబినెట్ సహచరులు కేకే శైలజ ఎంఎం మణి ఏసీ మొయిదీన్ సురేంద్రన్ రామచంద్రన్ క్రిష్ణ కుట్టీ టీపీ రామకృష్ణన్ చంద్రశేఖరన్ తదితరులు గెలుపొందారు. కేకే శైలజ మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపి అభ్యర్థి బిజు ఎలెక్కుయిపై ఆమె విజయం సాధించారు. ఆమె 61035 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.
కేరళలో ఇంత పెద్ద భారీ మెజారిటీతో గెలిచిన అతి కొద్ది మందిలో శైలజ ఒకరు అని అంటున్నారు. కాగా ఆరోగ్య మంత్రిగా ఆమె పనితీరు పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పని మరికొందరు అంటున్నారు. చివరిసారిగా కేరళ అత్యధిక ఓట్ల తేడాతో 2006 లో ఎం చంద్రన్ 47000 ఓట్లతో విజయం సాధించారు. ఇక సీఎం విజయన్ కూడా 50 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచినప్పటికీ కేకే శైలజ 60 వేల పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించారు. దీనికి ప్రధాన కారణం ఆమె కరోనా సమయంలో చేసిన సేవలే అని చెప్పక తప్పదు.