iDreamPost
android-app
ios-app

శైల‌జ టీచ‌ర్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదా : స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం

శైల‌జ టీచ‌ర్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదా : స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం

పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఇటీవ‌లే రెండో సారి అధికారం చేప‌ట్టింది. ఆయ‌న గ‌త కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌ని చేసిన కేకే శైల‌జ మ‌త్త‌న్నూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అత్య‌ధిక మెజారిటీ (61,035 )తో గెలుపొందారు. కేర‌ళ‌లో ఈ స్థాయిలో మెజార్టీ సాధించిన అతి కొద్ది మందిలో ఈమె ఒక‌రు. ఇందుకు కార‌ణం క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో శైలజ టీచ‌ర్ అందించిన సేవ‌లే. క‌రోనాకాలంలో ఆమె సేవ‌ల‌కు రాష్ట్రంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఐక్య రాజ్య స‌మితి అభినంద‌న‌ల‌ను సైతం అందుకున్నారు. ఎంతో కీర్తి పొందిన ఆమెకు క‌చ్చితంగా మంత్రి వ‌ర్గంలో బెర్త్ ఖాయ‌మ‌ని సాధార‌ణంగా అంద‌రూ భావిస్తారు. అందులోనూ ఇప్పుడు కూడా క‌రోనా రెండో ద‌శ విజృంభిస్తున్న స‌మ‌యంలో. కానీ ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

శైలజా టీచర్.. కేరళ జనాలకు ఈ పేరు వింటే ఒక భరోసా. ఒక పాజిటివ్ ఫీలింగ్. కేరళ ఆరోగ్య మంత్రిగా గత ఏడాది కాలంలో ఆమె అందించిన సేవల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. కొవిడ్ కల్లోల పరిస్థితుల్లో పగలూ రాత్రీ అని తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ.. రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రించడంలో.. ఆరోగ్య సేవలను విస్తరించడంలో.. వసతులను మెరుగుపరచడంలో ఆమె చూపించిన చొరవ గురించి ఎంతో చర్చ జరిగింది. వ్యాక్సినేషన్ కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా జరగడంలో శైలజ పాత్ర కీలకం అంటారు. కొవిడ్ పరిస్థితుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నేతల్లో ఒకరిగా బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు శైలజను గుర్తించడం, కొనియాడడం విశేషం. విజయన్ కేబినెట్లో అత్యుత్తమ మంత్రిగా శైలజ పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ కొత్త కేబినెట్లో ఆమెకు చోటు ద‌క్క‌లేదు.

కొత్త వారికి చాన్స్ ఇవ్వాలిగా : కేకే శైలజ టీచ‌ర్

కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే కేకే శైలజ స్పందించారు. నూతన కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తనకెలాంటి అసంతృప్తీ లేదని స్పష్టం చేశారు. ‘‘నూతన కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తీ లేదు. అది విధానపరమైన నిర్ణయం. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ భావోద్వేగాలే.’’ అని శైలజ పేర్కొన్నారు. నూతన బాధ్యతలు తీసుకునే వారెవరైనా వారు కొత్త వారేనని, కొత్త వారికి కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలని ఆమె అన్నారు. తమ పార్టీలో చాలా మంది సమర్థులున్నారని, వారికీ ఓ అవకాశమిస్తే వారూ సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె పేర్కొన్నారు. కేవలం తనను మాత్రమే ఆపలేదని, చాలా మంది మంత్రులను కూడా తీసుకోవడం లేదని అన్నారు. ‘‘ఇప్పటి వరకూ చేసిన పనిపై చాలా సంతృప్తితోనే ఉన్నాను. చాలా సిన్సియర్‌గా పనిచేశా. కేబినెట్ సహచరులతో కలిసి చాలా కష్టించి పనిచేశా. చాలా అనుభవాలున్నాయి. చాలా ఛాలెంజ్‌లను కూడా ఎదుర్కొన్నా. టీమ్ వర్క్‌గా పనిచేశా. నా పనిపై పూర్తి సంతృప్తితోనే ఉన్నా. ఈ ఐదేళ్లలో చాలా అనుభవాలే ఉన్నాయి’’ అని శైలజ ప్రకటించారు.