iDreamPost
android-app
ios-app

తొలి టెస్టులో భారత్‌పై పది వికెట్ల తేడాతో కివీస్ ఘనవిజయం

తొలి టెస్టులో భారత్‌పై పది వికెట్ల తేడాతో కివీస్ ఘనవిజయం

వెల్లింగ్టన్ వేదికపై జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ బ్యాట్స్‌మన్లు చేతులెత్తేయడంతో పాటు, బౌలింగ్‌లోనూ ఇషాంత్ శర్మ, అశ్విన్‌ మినహా మిగిలిన బౌలర్లు అంచనా మేర రాణించలేదు.దీంతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యత సంపాదించింది.

నాలుగోవ రోజు నాలుగు వికెట్లకు 144 పరుగులు వద్ద రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి కీలకమైన రహానె,విహారి వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె 75 బంతులలో 29 పరుగులు, హనుమ విహారి 79 బంతులలో 15 పరుగులు చేసి వెనువెంటనే ఔటయ్యారు. తర్వాత లో ఆర్డర్ లో కీపర్ రిషభ్‌ పంత్‌ 41 బంతులలో 25 పరుగులు చేసి పరవాలేదనిపించగా రవిచంద్రన్‌ అశ్విన్‌(4),ఇషాంత్‌ శర్మ(12), మహ్మద్‌ షమి(2), జస్ప్రీత్‌ బుమ్రా (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే దుకాణం కట్టేసింది.

తమ పదునైన పేస్,స్వింగ్ బంతులతో భారత్ బ్యాట్స్‌మన్లను బోల్తా కొట్టించిన కివీస్ బౌలర్లలో సౌథీ 5/61,బౌల్ట్ 4/39 అద్భుతంగా రాణించారు.అనంతరం 9 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్ జట్టు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది.దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకొని బోణీ కొట్టింది.ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరస విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాకు న్యూజిలాండ్‌ బ్రేక్ వేసింది.తొలి ఇన్నింగ్స్‌లో సైతం నాలుగు వికెట్లు పడగొట్టిన సౌథీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.