iDreamPost
android-app
ios-app

మహమ్మారిని ఎదుర్కోవడానికి ముద్దుని నిషేధించిన ఇంగ్లాండు చక్రవర్తి

మహమ్మారిని ఎదుర్కోవడానికి ముద్దుని నిషేధించిన ఇంగ్లాండు చక్రవర్తి

జులై 16,1439న ఇంగ్లాండు చక్రవర్తి ఆరవ హెన్రీ తన రాజ్యంలో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మీద నిషేధం విధించాడు. ఒక శతాబ్దం క్రితం ఆరంభమై యూరోప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలతో సహా ఇంగ్లాండులో మారణహోమం సృష్టిస్తున్న ప్లేగ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి హెన్రీ ప్రభువు ఆ నిర్ణయం తీసుకున్నాడు!

రెండవ ప్లేగ్ మహమ్మారి

క్రీ. శ. ఆరవ శతాబ్దం నుంచి ఎనిమిదో శతాబ్దం వరకూ ప్రపంచాన్ని పీడించి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న మొదటి ప్లేగ్ మహమ్మారి తరువాత బ్లాక్ డెత్ అని పేరు తెచ్చుకున్న రెండో మహమ్మారి 1331 సంవత్సరంలో మొదలై ప్రపంచమంతా విస్తరించి, ఇంగ్లాండులో కూడా అడుగుపెట్టింది. ప్లేగు సోకిన రోగులను నలభై రోజుల పాటు దూరంగా ఉంచే క్వారంటైన్ ప్రక్రియ 1377లో ఇటలీలో ప్రారంభమై సత్ఫలితాలు ఇచ్చినా, ఆ సంగతి మిగతా ప్రపంచానికి తెలియడానికి కొంతకాలం పట్టింది.

1421లో జన్మించిన ఆరవ హెన్రీ తన తండ్రి మరణంతో సంవత్సరం వయసు నిండకముందే ఇంగ్లాండుకి రాజు అయ్యాడు. అతని తరఫున అతని మంత్రులు పరిపాలన సాగించి, పదేళ్ళ వయసులో పట్టాభిషేకం చేశారు. హెన్రీకి అనుభవం తక్కువ అయినా మంచి పరిశీలనా శక్తి ఉంది. దాన్ని ఉపయోగించి ఒకరినొకరు తాకకుండా ఉంటే ప్లేగ్ వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని గ్రహించాడు.

ఆ రోజుల్లో ఒకరినొకరు పలకరించుకోవడానికి బుగ్గకు బుగ్గ తాకించడం, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం సాధారణంగా ఉండేది. రాజు గారిని కలిసినప్పుడు అందరూ రాజుగారి చేతికి ఉన్న రాజముద్రిక మీద ముద్దు పెట్టడం తప్పక పాటించవలసిన ఆచారం.

1439 నాటికి ప్లేగ్ సమస్య కారణంగా ఒకటిన్నర సంవత్సరం వరకూ బ్రిటిష్ పార్లమెంటు సమావేశాలు జరగలేదు. అయితే ఫ్రాన్స్ తో సంబంధాలు దెబ్బతిని, యుద్ధ వాతావరణం నెలకొనడంతో పార్లమెంటు సమావేశం జరగక తప్పని పరిస్థితి ఎదురైంది. అప్పుడు ముద్దు పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ రాజాఙ విడుదల చేశాడు ఆరవ హెన్రీ.

అయితే రాజుగారి ఆఙను ప్రజలు ఎంతవరకు పాటించారో తెలియదు. ప్రజలందరూ దానిని పాటించేలా చేయగల యంత్రాంగం కూడా అప్పుడు లేదు. రెండవ ప్లేగ్ మహమ్మారి తన కరాళనృత్యం పందొమ్మిదో శతాబ్దం వరకూ కొనసాగించి లక్షలాది మందిని బలి తీసుకుంది.