Idream media
Idream media
రైతులు చేస్తున్న ఆందోళనల వెనుక కేవలం మూడు చట్టాల రద్దు మాత్రమే కాదు. మొత్తం రైతాంగం మనుగడ ఉందని నమ్ముతున్నారు. అందుకే నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై వారి పోరాటం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. రూపం మార్చుకుంటున్నా సజీవంగా ఉంది. ప్రస్తుతం మీడియా దృష్టి కొవిడ్‌పైనే ఉండడంతో రైతు ఉద్యమం ప్రభావం బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు.
సరిగ్గా గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం నూతనంగా తెచ్చిన నిత్యావసర సరకుల(సవరణ) బిల్లు, ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు’, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020లు ఆమోదం పొందాయి. వాటి రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు ప్రారంభించారు. కొద్ది నెలలుగా నిరంతరాయంగా రైతుల నిరసన కొనసాగుతోంది.
కరోనా విజృంభణ కాలంలోనూ రైతులు తమ ఆందోళనలు ఆపలేదు. ఇప్పటికే పదకొండుసార్లు రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహించింది. పలు సవరణలు ప్రతిపాదించింది. నిబంధనలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కార దిశగా చర్చలు సాగిద్దామని పేర్కొంది. మూడు చట్టాల ఉపసంహరణ మినహా వేరే ఆప్షన్ కు ఒప్పుకునేది లేదని ప్రతీ సమావేశంలోనూ రైతు నాయకులు కట్టుబడి ఉన్నారు. చట్టాల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు రైతులు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు, బయట రైతులు చట్టాల రద్దుకు పోరాడుతున్నారు. రైతులు వినూత్న నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పార్లమెంటుకు సమీపంలోని జంతర్‌మంతర్‌లో 200 మందితో ‘రైతుల పార్లమెంటు (కిసాన్ సంసద్)’ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పార్లమెంటును ఎలా నడపాలో తమకూ తెలుసనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడమే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.
రైతుల పార్లమెంటులో మూడు సెషన్లు నిర్వహిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఆరుగురిని ఎంపిక చేశారు. రైతుల పార్లమెంటులో ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు పేర్లు ఇవ్వాల్సి ఉంటుందని నిర్ణయించారు. భోజన, టీ విరామాలు ఉంటాయి. రైతు ఉద్యమం కొత్త పంథాలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఎర్రకోట ఎపిసోడ్ దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మరోమారు రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నారు. రైతు సంఘాల నుంచి ఇంకా ఎటువంటి సమాధానం కేంద్రానికి పంపలేదు. ఆగస్టు 9 వరకు కిసాన్ సంసద్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.