iDreamPost
iDreamPost
వ్యక్తులను, వ్యవస్థలను వాడుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించినవారు లేరు. తనను నమ్ముకున్నవారిని.. చివరికి తాను హామీ ఇచ్చినవారిని సైతం అవసరానికి వాడుకుని వదిలేయడం ఆయనకు అలవాటే. ఎవరిని ఎంతవరకు అవసరమో అంతవరకు మునగచెట్టు ఎక్కించడం.. ఇక వారితో పనిలేదని తేలిన వెంటనే ఆ చెట్టును నరికేసి.. వారిని నట్టేట ముంచేస్తారు. టీడీపీలో అలా తెరమరుగైపోయిన వారెందరో ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ మాజీమంత్రి చేరిపోయారు. ఆయనే విశాఖ జిల్లా అరకు నియోజకవర్గ నేత కిడారి శ్రావణ్ కుమార్. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ని టీడీపీ అధినేత దాదాపు పక్కన పెట్టేశారు. ఆయనకు బదులు మరో నేతను ప్రోత్సహిస్తున్నారు.
సానుభూతి కోసం గతంలో ప్రోత్సాహం
రాజకీయాల్లోనే లేని శ్రావణ్ ను చంద్రబాబే రెచ్చగొట్టి తీసుకొచ్చారు. శ్రావణ్ తండ్రి కిడారి సర్వేశ్వర రావు వైఎస్సార్సీపీలో ఉంటూ 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి 2016లో టీడీపీలో చేరారు. అయితే 2018 సెప్టెంబర్ 23న మావోయిస్టుల దాడిలో కిడారితో పాటు, మరో టీడీపీ నేత సివేరు సోమ దుర్మరణం చెందారు. ఆ సందర్భంగా సీఎం హోదాలో పరామర్శకు కిడారి ఇంటికి వెళ్లిన చంద్రబాబు మీకెందుకు నేనున్నాను.. అన్నీ చూసుకుంటాను.. రాజకీయంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాను అని కిడారి పెద్ద కుమారుడైన శ్రావణ్ ను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని కూడా ప్రకటించేశారు. దాంతో అప్పటివరకు ఐఐటీ చదివి ఢిల్లీలో ఉంటున్న శ్రావణ్.. రాజకీయాల్లోకి రావడమే ఆలస్యం 2018 నవంబర్ 11న ఆయన్ను మంత్రిగా నియమించారు.
ఏజెన్సీ మొత్తం ఎన్నికల్లో సానుభూతి లభిస్తుందన్న ఆశతో 2019 ఎన్నికల్లో అరకు టికెట్ ఇచ్చారు. కానీ ఏ సానుభూతి లభించక ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ చేతిలో శ్రావణ్ చిత్తుగా ఓడిపోవడమే కాకుండా మూడో స్థానానికి దిగజారిపోయారు. ఫల్గుణకు 53,101 ఓట్లు లభించగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొన్ను దొర 27,600 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 19 వేేల ఓట్లు పొందిన శ్రావణ్ డిపాజిట్ కూడా కోల్పోయారు.
ఒంటరైన శ్రావణ్
మంత్రి హోదాలో ఎన్నికల్లో పోటీ చేసిన శ్రావణ్ నిబంధనల ప్రకారం పదవి చేపట్టిన ఆరు నెలల్లోపు చట్టసభలకు ఎన్నిక కాలేకపోవడంతో ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజుల ముందు 2019 మే 10న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఇంఛార్జిగా కొన్నాళ్లు చురుగ్గానే పనిచేశారు. అయితే కార్యకర్తలు, నేతలు, చివరికి పార్టీ అధిష్టానం నుంచి సహకారం లభించలేదు. దాంతో ఆయన ఒంటరి అయిపోయారు. స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ప్రమేయం లేకుండా చేశారు. దాంతో అధినేత తనను దూరం పెడుతున్నారని అర్థం చేసుకున్న శ్రావణ్ కూడా నిర్లిప్తత వహించడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా చంద్రబాబు మరో నేతను రంగంలోకి దించడానికి చర్యలు చేపట్టారు.
2019 ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేసి 27 వేలకుపైగా ఓట్లు సంపాదించిన దొన్ను దొరను ఇటీవలే టీడీపీలో చేర్చుకున్నారు. నియోజకవర్గంలో పార్టీపరంగా ఆయన్నే ముందు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని దొన్ను దొర తన అనుచరులతో ప్రచారం చేయించుకుంటున్నారు. దాంతో శ్రావణ్ కుమార్ రాజకీయ జీవితం మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది.
Also Read : రఘురామ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం