iDreamPost
android-app
ios-app

స్టాలిన్ ఇలాకాలో కుష్బూ రాజకీయ అరంగేట్రం!

స్టాలిన్ ఇలాకాలో కుష్బూ రాజకీయ అరంగేట్రం!

తమిళనాడులో ఒకప్పుడు కుష్బూ పేరు వింటేనే యువతరంలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేది. ఆమెకు గుడి కట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది అప్పట్లో దేశవ్యాప్త సంచలనం అయ్యింది. మరి ఇంత ప్రజాదరణ ఉన్న కుష్బూ రాజకీయాల్లో రాణించగల రా? వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున బరిలోకి దిగుతున్న ఆమె కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు డీఎంకే కు పట్టు ఉన్న థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో నిలవడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

17లో కుష్బూ పేరే కీలకం

అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో బిజెపి 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. వీటిలో పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు పార్టీ విడుదల చేసింది. దీనిలో కుష్బూ పేరు ఉంది. ఆమె థౌసండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ తీర్పుర్ జిల్లా, ధారాపురం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఖుష్బూ డిఎంకె అభ్యర్థి డాక్టర్ ఎన్. ఎజహిలన్ ను ఎదుర్కోవలసి ఉంటుంది. చెన్నై సెంట్రల్ లోక్సభ స్థానం పరిధిలోని వచ్చే థౌసేండ్ లైట్స్ నియోజకవర్గంలో మొత్తం 2,35,653 మంది ఓటర్లు ఉన్నారు. దీన్ని అతిపెద్ద నియోజకవర్గంగా అన్ని పార్టీలు భావిస్తాయి. అందులోనూ చెన్నైలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధి పరంగానూ ముందు ఉంది. అక్షరాస్యత శాతం 80 శాతం పైగానే ఉండడంతో ఇక్కడ చదువుకున్న ఓటర్లను కుష్బూ ఎంతమేరకు ప్రభావితం చేయగలరు అన్నది కీలకం కానుంది.

డీఎంకె ప్రభావం అధికం

ఈ నియోజకవర్గంలో డీఎంకే ప్రభావం అధికం. 1971 లో నియోజకవర్గం ఏర్పడిన దగ్గర్నుంచి 2016 ఎన్నికల వరకూ మొత్తం పది సార్లు డిఎంకె ఇక్కడ గెలిచింది. ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2016 ఎన్నికల్లో కేకే సెల్వం డీఎంకే నుంచి 8,829 ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి వలర్ మతి మీద గెలిచారు. అయితే ఆయన ఇటీవల బీజేపీలో చేరడం తో ఈ స్థానం నుంచి డిఎంకె కొత్త అభ్యర్థిని బరిలో దింపాల్సి వచ్చింది. డాక్టర్ గా అందరికీ సుపరిచితుడైన, సున్నితమైన వ్యక్తిగా అందరికీ తెలిసిన డాక్టర్ ఎజాహిలన్ ను తమ అభ్యర్థి గా స్టాలిన్ ప్రకటించారు.

ప్రభావితం ఉంటుందా?

బిజెపి ఈ నియోజకవర్గం నుంచి కుష్బూను రంగంలో దింపడం వెనక ఆమె సినీ గ్లామర్ తో పాటు , ఇక్కడ నుంచి 2016లో గెలిచిన సెల్వం బీజేపీలో చేరడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన వ్యక్తిగత పరిచయాలు వల్ల కుష్బూకు కలిసొస్తుందని, ఆయనకు ఉన్న సొంత క్యాడర్ బిజెపి కు ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది. అందులోనూ చదువుకున్న ఓటర్లు ఎక్కువగా కనిపించే ఈ నియోజకవర్గంలో కచ్చితంగా కుష్బూ కు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తోంది. అయితే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తాను ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం మీద పట్టును మాత్రం కోల్పోలేదు అన్నది డీఎంకే వాదన.

మరోపక్క మొదట డీఎంకే నుంచి తర్వాత కాంగ్రెస్ లోకి ఇప్పుడు బిజెపి లోకి మారిన కుష్బూ ను నగర ఓటర్లు నమ్మే పరిస్థితి లేదన్నది డీఎంకే వర్గాల వాదన. ఇదే నినాదాన్ని ఖుష్బూ మీద అసెంబ్లీ ఎన్నికల్లో వాడెందుకు డీఎంకే సిద్ధమవుతోంది. ఆమె పలు పార్టీలు మారి వచ్చిందనే విషయాన్నీ ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఆమెకు నష్టం చేకూర్చే అవకాశాలను డీఎంకే పరిశీలిస్తోంది. మరి వీటన్నిటినీ దాటుకొని కుష్బూ ఎలాంటి రాజకీయ చాణక్యం తో ముందుకు వెళ్తారు, కీలకమైన ఈ నియోజకవర్గంలో తన సత్తా ఎలా చేస్తారు అన్నది త్వరలోనే తెలుస్తోంది.