iDreamPost

Khiladi : మాస్ అంటే మసాలా ఒకటే కాదు

Khiladi : మాస్ అంటే మసాలా ఒకటే కాదు

నేనిప్పుడో వంద కోట్ల సినిమా చేయబోతున్నానని దర్శకుడు చెప్పుకున్నా ఖిలాడీ ఫైనల్ గా డిజాస్టర్ వైపే వెళ్తోంది. థియేట్రికల్ బిజినెస్ కోసం టార్గెట్ పెట్టుకున్న ఇరవై రెండు కోట్లను షేర్ రూపంలో తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమే. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన డిజె టిల్లుని సైతం మాస్ రాజా మూవీ తట్టుకోలేకపోతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ కు ముందు రమేష్ వర్మ రవితేజ మధ్య ఉన్న మనస్పర్థలు ఏకంగా స్టేజి మీదే బయటపడ్డాయి. డైరెక్టర్ సతీమణి ఇన్స్ టాలో హీరో మీద కౌంటర్లు వేయడం లాంటి వ్యవహారాలు కూడా దీని విషయంలోనే జరిగాయి. మొత్తానికి క్రాక్ తర్వాత మరో హిట్టు కొట్టాలన్న ఫ్యాన్స్ లక్ష్యం నెరవేరలేదు.

ఖిలాడీ మరోసారి ఖరీదైన పాఠం నేర్పించింది. కేవలం భారీతనం, హంగులు, కోట్ల రూపాయల ఖర్చు, లాజిక్కు లేని సన్నివేశాలు, అర్థం లేని యాక్షన్ ఎపిసోడ్లు, శృతిమించిన హీరోయిన్ల అందాల ఆరబోతలు ఇవేవి హిట్టు ఇవ్వవని మరోసారి నిరూపించింది. రవితేజకు గతంలోనూ ఈ తరహా అనుభవాలున్నాయి. అమర్ అక్బర్ ఆంటోనీ , నేల టికెట్, టచ్ చేసి చూడు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. హీరోకు కథ నచ్చడం కన్నా ముఖ్యంగా దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారన్నది కీలకం. పబ్లిక్ లో ఎంత హడావిడి చేసినా అసలు మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. ఖిలాడీ విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగిన ఖిలాడీకి ఇలా జరగడం ఊహించనిదే. ఏ మాత్రం యావరేజ్ అనిపించుకున్నా చాలు గట్టెక్కే ఛాన్స్ ఎక్కువగా ఉండేది. కానీ అలా జరగలేదు. పది కోట్లకు పైగా నష్టం తప్పదనే అంచనాలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. కాకపోతే ఈ శుక్రవారం పెద్దగా చెప్పుకునే సినిమాలు లేకపోవడాన్ని ఖిలాడీ ఏమైనా ఉపయోగించుకుంటే లోటు తగ్గొచ్చు. గతంలో వీరతో ఇదే రిజల్ట్ అందుకున్న రమేష్ వర్మ మళ్ళీ రిపీట్ చేయడం వింతే. రాబోయే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా,రావణాసురల మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో అభిమానులు ఖిలాడీ గాయాన్ని త్వరగానే మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు

Also Read : Bigg Boss OTT : ఇరవై నాలుగు గంటల గేమ్ షో కీలక అప్డేట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి