iDreamPost
iDreamPost
మాములుగా వేరే భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చేయడం సాధారణం. అలా అనువదించాక కూడా మళ్ళీ దాన్నే రీమేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని దెబ్బ తిన్నాయి. ఉదాహరణకు భాగ్యరాజా తమిళ చిత్రాన్ని ‘చిన్నరాజా’గా ఇక్కడి ఆడియన్స్ కి అందించాక వెంకటేష్ తో ఈవివి ‘అబ్బాయిగారు’గా తీస్తే రెండూ హిట్ అయ్యాయి. ఇది తూర్పు సిందూరం-చిలకపచ్చ కాపురం కేసులో రివర్స్ అయ్యింది. పార్తీబన్ సీతల ‘యముడే నా మొగుడు’ని తిరిగి మోహన్ బాబు ‘రౌడీ గారి పెళ్ళాం’గా అందిస్తే ఇద్దరు నిర్మాతలకూ లాభాలు వచ్చాయి. దీనికి భిన్నమైన మరో ఉదాహరణ చూద్దాం.
1992లో మలయాళంలో మమ్ముట్టి హీరోగా కౌరవర్ అనే సినిమా వచ్చింది. ఏకె లోహితదాస్ రచన చేయగా జోషీ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్కడ ఘనవిజయం సాధించింది. వయసొచ్చిన కూతురి తండ్రిగా నటించినా హీరో పాత్రను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. కీలకమైన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని కన్నడ అగ్ర కథానాయకుడు విష్ణువర్ధన్ పోషించడం దీనికి చాలా ప్లస్ అయ్యింది. విలన్ గా తిలకన్ విశ్వరూపం చూపించారు. దీన్ని తెలుగులో కంకణం పేరుతో డబ్బింగ్ చేస్తే మన ప్రేక్షకులు ఆదరించారు. కాకపోతే వెళ్లాల్సిన పెద్ద రేంజ్ కి చేరుకోలేదు. ఈ అవకాశాన్ని గుర్తించిన మోహన్ బాబు ఈ కౌరవర్ ని మళ్ళీ తీస్తే నటించేందుకు రెడీ అయ్యారు.కట్ చేస్తే ఖైదీగారు టైటిల్ తో దీన్నిసెట్స్ పైకి తీసుకెళ్లారు. శాండల్ వుడ్ లో సెంటిమెంట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న సాయి ప్రకాష్ దర్శకుడిగా అక్కడ విష్ణువర్ధన్ చేసిన పాత్రని ఇక్కడ కృష్ణంరాజుతో చేయించారు.
మాస్ ని సంతృప్తిపరచడానికి హీరోయిన్ లైలాని పాటల కోసం తీసుకున్నారు. కోటి సంగీతం అందించగా ఎంవి రఘు ఛాయాగ్రహణం సమకూర్చారు. తన బిడ్డను చావుకు ఓ పోలీస్ ఆఫీసర్ కారణమయ్యాడని భావించిన ఓ గ్యాంగ్ స్టర్ జైలు నుంచి బయటికి వచ్చాక అతన్ని చంపేందుకు కంకణం కట్టుకుంటాడు. ఆయన మరణానికి కారణం అవుతాడు. కానీ చివరి క్షణాల్లో తన బిడ్డ చనిపోలేదని అతని ముగ్గురి కూతుళ్ళలో ఒకరని తెలుసుకుంటాడు. అక్కడి నుంచి తన బాస్ మాఫియా డాన్ నుంచి వాళ్ళను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. మలయాళంలో పండిన డ్రామా తెలుగుకు వచ్చేటప్పటికీ తేలిపోయింది. ఎమోషన్స్ ని సరైన రీతిలో ప్రెజెంట్ చేయలేకపోవడంతో 1998లో విడుదలైన ఖైదీగారు ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది కానీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. మంచి క్లాసిక్ వృధా అయ్యింది
Also Read : Real Star Srihari : విలన్ శ్రీహరిని హీరోని చేసిన సూపర్ హిట్ – Nostalgia