iDreamPost
iDreamPost
కొత్త సినిమాలను ఓటిటిలో విడుదల చేయడం ఇప్పుడు సాధారణం అయిపొయింది, ఎవరికీ కనీసం పేరు కూడా తెలియని అమృతరామంతో మొదలుకుని నాని లాంటి స్టార్ హీరో నటించిన వి దాకా తెలుగులోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వచ్చాయి. సదరు సంస్థలు ఎన్ని వ్యూస్ వచ్చాయనే విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నాయి కానీ లేదంటే ఏది ఏ స్థాయి బ్లాక్ బస్టరో ఫ్లాపో అర్థమయ్యేది కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఉదాహరణకు వి మొదటి రోజు ఎన్ని లక్షల మంది చూశారో డేటా బయటికి వచ్చి ఉంటే ఫ్యాన్స్ కి ప్రమోషన్ లాగా ఉపయోగపడేది. కానీ పాలసీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే ప్రైమ్ అలాంటివి చేసే అవకాశం లేదు.
కొద్దిరోజుల క్రితం ఐడ్రీం చెప్పినట్టుగా ఓటిటిలో కొత్త ట్రెండ్ కి మొదటి అడుగు పడిపోయింది. జీ ప్లెక్స్ ద్వారా ఖాలీ పీలి సినిమాను అక్టోబర్ 2న పే పర్ వ్యూ (చూసే ప్రతిసారి డబ్బులు కట్టడం)మోడల్ లో రిలీజ్ చేయబోతున్నారు. టికెట్ రేట్ ఎంత అనేది ఇంకా బయటికి చెప్పలేదు. 100 నుంచి 150 రూపాయల మధ్యలో ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. అయితే ఇందులో స్టార్ హీరో ఎవరూ లేరు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఇషాన్ ఖట్టర్ ఇందులో కథానాయకుడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా చేసింది. నెపోటిజం మీద ఆన్ లైన్లో తీవ్ర స్థాయి ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనన్య కూడా టార్గెట్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాడే (సాహోలో నటించారు)కూతురే ఈ అనన్య. తను కూడా టార్గెట్ లిస్ట్ లో ఉంది.
సడక్ 2 విషయంలో అలియా భట్ మీద కోపంతో ట్రైలర్ ని వరల్డ్ రికార్డు మిలియన్లతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. దీనికి అలాగే జరుగుతుందని అనుమానం లేకపోలేదు. ఖాలీ పీలి ఒక రోడ్ జర్నీ థ్రిలర్. 18 ఏళ్ళ వయసు రాగానే తాను పుట్టి పెరిగిన వేశ్య కొంప నుంచి హీరోయిన్ భారీ మొత్తం డబ్బును దొంగతనం చేసి పారిపోతుంది. తనను పట్టుకోవడానికి ముఠాలు బయలుదేరతాయి. అప్పుడు పరిచయమవుతాడు హీరో. అటుఇటు కొంచెం కార్తీ ఆవారా ఛాయలు కనిపిస్తున్నాయి కదూ. అదే టైపు అవునో కాదో ఇంకో నెల రోజుల్లో తేలిపోతుంది. జీ ప్లెక్స్ ని పూర్తిగా పే మోడల్ లో తీర్చిదిద్దారు. ఇది కనక సక్సెస్ అయితే ఇకపై ఈరోస్, ధర్మా, సోనీ లాంటి సంస్థలు కూడా ఇదే తరహా ప్లానింగ్ లో ఉన్నాయి. ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటివి మాత్రం ప్రస్తుతానికి అలంటి ఆలోచనలు చేయడం లేదు