Idream media
Idream media
చిన్న, పెద్ద.. పని ఏదైనా సరే బాలారిష్టాలు సర్వసాధారణం. లోటుపాట్లు సవరించుకున్న తర్వాత ఆ పని సజావుగా సాగిపోతుంది. ఆయా అడ్డంకులు, లోపాలను ఎప్పటికి పరిష్కారం అవుతాయనేది ఆయా పనులు చేసే వారి చొరవను బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్ అమలు చేస్తున రేషన్ డోర్ డెలివరీ విధానం కూడా ప్రస్తుతం బాలారిష్టాలు దశలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల మంది రేషన్‌కార్డుదారులకు 9,260 వాహనాల ద్వారా ఇంటి వద్దనే రేషన్, ఇతర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.
గత నెల ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఫిబ్రవరి ఒకటో తేదీన పట్టణాల్లో ప్రారంభం కాగా.. పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా పల్లెల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం కార్యక్రమం రెండో అడుగు వేసింది. మార్చి నెల సరుకులను పంపిణీ చేస్తున్నారు. అయితే వాహనం ఎప్పుడు వస్తుంది..? అనే విషయంపై స్పష్టత లేక లబ్ధిదారుల సమయం వృథా అవుతోంది. రేషన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా అందరూ ఒకే సారి వాహనం వద్దకు వస్తున్నారు. మరో వైపు ఎప్పటి లాగే సర్వర్ సమస్యల వల్ల పంపిణీ ఆలస్యమవుతోంది.
క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలు తీరు ఎలా ఉందో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమాచారం తీసుకుంటోంది. గత నెలలో పంచాయతీ ఎన్నికలు, ఈ నెలలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం తీరికలేకుండా ఉన్నా.. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేరుగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. రేషన్ డోర్ డెలివరీలో విధానంలో లోటుపాట్లును తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
లబ్ధిదారులు వేచిచూడకుండా, వారి సమయం వృథా కాకుండా ఈ నెల నుంచి టోకెన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టోకెన్లు పంపిణీ చేయడంతోపాటు.. వాహనం తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ఒక రోజు ముందు వారి ఫోన్‌కు సందేశాల ద్వారా చేరవేయనుంది. వలంటీర్ ద్వారా టోకెన్లు పంపిణీ చేయబోతున్నారు. లబ్ధిదారులు సమస్త సమాచారం గ్రామ సచివాలయాల్లో ఉండడంతో ఈ పనిని ప్రభుత్వం ఈ నెల నుంచే మొదలుపెట్టింది. వలసకూలీలు ఫోర్టబులిటీ ద్వారా ఏ వాహనం నుంచైనా సరే, ఏ సమయంలోనైనా రేషన్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.