iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. కొద్ది రోజుల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారబోతున్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు చేసింది. పాలనా వికేంద్రకరణ చట్టాల అమలుకి అంతా సిద్ధమవుతోంది. దాంతో పాటుగా జిల్లాల విభజనకు కూడా రంగం సిద్ధమయ్యింది. దాంతో ఈ రెండు పరిణామాలు పెను మార్పులకు దోహదం చేయబోతున్నాయి. ఇప్పటికే రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్న వారు కూడా తమ భవిష్యత్తుకి అనుగుణంగా మార్పులను అర్థం చేసుకుని కొత్తగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధాని వైపు రాజ్ భవన్, సీఎంవో, సెక్రటేరియేట్ మారితే విశాఖ కీలక స్థానం అవుతుంది. ఇప్పటికే పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలతో ఆ నగరం కళకళలాడుతుంది. త్వరలో రాజకీయాలకు కేంద్ర స్థానం అవుతుంది. తద్వారా రాజకీయాల్లో విశాఖ పరిణామాలు అందరినీ ఆకర్షించే స్థాయికి చేరుతాయి. అదే సమయంలో అమరావతి పరిరక్షణ పేరుతో కొందరు చేస్తున్న ఉద్యమానికి ఇక ముగింపు అనివార్యం అవుతుంది. అమరావతి చుట్టూ మోహరించిన భూ యజమానుల పరిస్థితి తల్లకిందులవుతుంది. కర్నూలు కేంద్రంగా న్యాయవ్యవహారాలకు శ్రీకారం పడుతుంది. శ్రీభాగ్ ఒప్పందం నాటి రాయలసీమ వాసుల ఆశలు కర్నూలు న్యాయరాజధానిగా మారడంతో కొంతమేరకు నెరవేరుతాయి.
జిల్లాల విభజనకు కూడా ఇప్పటికే అధికారుల కమిటీ రిపోర్ట్ సమర్పించారు. త్వరలో దానికి తుది కసరత్తులు చేసి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలు రెట్టింపు కాబోతున్నాయి. 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త రూపు సంతరించుకుంటుంది. అదే సమయంలో జిల్లాల్లో రాజకీయ సమీకరణాలకు కూడా కొత్త పయనం ఆరంభమవుతుంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల వ్యాప్తంగా పెత్తనం చేస్తున్న రాజకీయ పెద్దలకు ఈ మార్పులు కొత్త మలుపు తీసుకుంటాయనే చెప్పాలి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు కావడంతో ఆయా జిల్లాల పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలు కూడా మారుతాయి.
అటు రాష్ట్ర రాజధాని, ఇటు జిల్లా పాలనా కేంద్రాల్లో వస్తున్న మార్పులతో పొలిటికల్ తెర పూర్తి మార్పులతో సిద్ధమవుతుంది.
ఇదంతా ఈ ఏడాది మధ్య నాటికి తుది రూపం సంతరించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల ప్రక్రియ కూడా జరిగితే రాజకీయ తెర మీద కొత్త మొఖాల పెత్తనానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఇదంతా జగన్ ఆశిస్తున్నట్టుగా కొత్త శక్తులకు అవకాశం ఉంది. పలువురు నేతలు ముందుకు రావడానికి దోహదపడుతుంది. ఇప్పటికే ఏపీ క్యాబినెట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న యువతరంతో పాటుగా త్వరలో జిల్లాల్లో కూడా యువనాయకత్వానికి పగ్గాలు దక్కే దిశగా పరిణామాలు ఉంటాయి.