గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పై దాదాపు స్పష్టత వచ్చింది. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నాయకుడు కె.కేశవరావు పెద్ద కుమార్తె గద్వాల విజయలక్ష్మిని హైదరాబాద్ మేయర్ చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈసారి జనరల్ మహిళలకు రిజర్వు అయిన మేయర్ పీఠం మీద కేకే కుమార్తె విజయలక్ష్మి కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది.
2015 లోనే దక్కినట్టే దక్కి!
2015 లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లోనే గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పీఠాన్ని ఆశించారు. దీని మీద కేశవరావు సైతం కేసీఆర్‌తో మంతనాలు జరిపి విజయలక్ష్మిని హైదరాబాద్ మొదటి పౌరురాలు చేయాలని ఆశించారు. 2015 లో బంజారాహిల్స్ నుంచి మొదటి సారి కార్పొరేటర్ గా గెలిచిన ఆమెకు భారతదేశ పౌరసత్వం విషయంలో ఆటంకం ఏర్పడింది. 1988లో అనే అమెరికన్ గ్రీన్‌కార్డ్ హోల్డర్ ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయిన విజయలక్ష్మి 1999లో అమెరికా పౌరసత్వాన్ని సైతం తీసుకున్నారు. 2004లో మళ్లీ కుటుంబసమేతంగా ఆమె ఇండియాకు తిరిగి వచ్చారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవాలని చురుగ్గా ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. అయితే 2009 నాటికి ఆమెకు మళ్లీ భారత పౌరసత్వం దక్కింది. ఇండియన్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 5 ప్రకారం భారత పౌరసత్వం తీసుకున్నాక ఖచ్చితంగా 15 సంవత్సరాలు రాజకీయాలకు, రాజ్యాంగబద్ధ పదవులకు దూరంగా ఉండాలని ఉన్న నేపథ్యంలో ఆమెకు హైదరాబాద్ మేయర్ పీఠం అప్పట్లో దూరమైంది. చివరకు బొంతు రామ్మోహన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్ చేశారు.
ఆధ్యాత్మికత లో ఎక్కువగా!
గద్వాల్ విజయలక్ష్మి ఆధ్యాత్మిక విషయాల్లో ముందుంటారు. ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న బంజారాహిల్స్ ప్రాంతంలో రెండు ఆలయాలను ఇటీవల నిర్మించారు. హిందూ ధర్మాన్ని ఆచరించడం తన కర్తవ్యం అంటూ ఆమె పదేపదే చెబుతుంటారు. ఆలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికి విజయలక్ష్మి తరచూ హాజరవుతూ ఉంటారు. మేయర్ ఎన్నిక సందర్భంగా బుధవారమే ఆమె తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొని, అంతా సజావుగా జరగాలని మొక్కుకున్నారు. నిత్యం ఆమె ఆధ్వర్యంలో ఉండే ఆలయాల వద్ద అన్నదానాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవ్వడం విజయలక్ష్మి స్టైల్.
ఉప మేయర్ రెడ్డి వర్గానికి…
2015 హైదరాబాద్ మేయర్ పీఠం మీద బీసీ అభ్యర్థిని కూర్చోబెట్టిన గులాబీ బాస్ ఈసారి ఉప మేయర్‌గా రెడ్డి వర్గానికి చెందిన వారికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. తార్నాక నుంచి గెలిచిన లతా శోభన్ రెడ్డి ని ఉప మేయర్‌గా కెసిఆర్ ప్రతిపాదించినట్లు తెలిసింది. రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠం జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో టీఆర్ఎస్ కు దూరం అవుతున్నారని కెసిఆర్ భావిస్తున్న రెడ్డి వర్గానికి ఈసారి ఇవ్వాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన ఓటమి కారణాలను విశ్లేషించడం తో పాటు గతంలో గద్వాల విజయలక్ష్మికి కేసీఆర్ హామీ మేరకు ఆమెను మేయర్ పీఠం మీద రెడ్డి వర్గానికి చెందిన మహిళను ఉప మేయర్ చేయడానికి గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలిసింది.
ఎంఐఎం బయటి నుంచి మద్దతు
మేయర్ ఎన్నికల్లో మేజిక్ మార్కు కు 10 సీట్ల దూరంలో ఉండి పోయిన అధికార పార్టీ టిఆర్ఎస్ కు మజ్లీస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు దాదాపు అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఎలాంటి షరతులు లేకుండా మజ్లీస్ టిఆర్ఎస్ కు బయటి నుంచి మద్దతు ఇచ్చి కనీసం ఎలాంటి పదవులు ఆశించకుండా మేయర్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ తో మాట్లాడినట్లు తెలిసింది. జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికల్లో ఇరుపార్టీలు జట్టు కడితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి లబ్ధి పొందే అవకాశం ఉందని, ఆ అవకాశం బీజేపీ కు ఇవ్వకుండా ఉండేందుకే మజిల్స్ ను బయట నుంచి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మొదలయ్యే హైదరాబాద్ మేయర్ ఎన్నికలలో దాదాపు ఇప్పటికే పేర్లు ఖరారు కావడంతో ఇక అన్నీ లాంఛనంగానే జరగనున్నాయి.