iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ వేళ‌.. పిన‌ర‌యి విజ‌య‌న్ విశిష్ఠ సేవ‌లు

లాక్ డౌన్ వేళ‌.. పిన‌ర‌యి విజ‌య‌న్ విశిష్ఠ సేవ‌లు

నాలుగు దశాబ్దాల కేరళ రాజకీయ చరిత్రలో ఒకే వ్యక్తికి వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితి లేదు. ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టిన కేరళ ప్రజలు విజయన్ కు వరుసగా రెండో సారి అధికారాన్ని అప్ప‌గించారు. అందుకు కార‌ణం కేర‌ళ ప్ర‌జ‌ల‌కు పినరయి విజయన్ ప్ర‌భుత్వం అందించిన సేవ‌లే. ప్ర‌ధానంగా క‌రోనా విప‌త్తు స‌మ‌యంలో ఆ ప్ర‌భుత్వం అవ‌లంబించిన విధానాలు దేశానికే ఆద‌ర్శంగా మారాయి. దేశంలో తొలి కేసు అక్క‌డే న‌మోదైనా పాల‌క ప‌క్షం, అధికార ప‌క్షం స‌మ‌ష్టిగా కృషి క‌రోనా తొలి ద‌శ‌పై కేర‌ళ విజ‌యం సాధించింది. అక్క‌డి ప్ర‌తిప‌క్షం కూడా ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచింది. మొత్తంగా క‌రోనాపై పోరులో కేర‌ళ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించింది. ఇటీవ‌లే సీఎంగా రెండో సారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన విజ‌య‌న్ .. క‌రోనా రెండో ద‌శ క‌ట్ట‌డికి లాక్ డౌన్ విధించారు.

లాక్ డౌన్ విధించ‌క త‌ప్ప‌లేదు..

తాజాగా కేరళ రాష్ట్రంలో భయంకరంగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పాజిటివిటీ పెరుగుతుందని పేర్కొన్న సీఎం పినరయి విజయన్ కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించ‌క త‌ప్ప‌లేద‌న్న ఆయ‌న‌.. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. కరోనా రోగులకు, బాధిత కుటుంబాలకు, కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్, వలస కూలీలకు ఉచితంగా ఫుడ్ కిట్స్ ను హోం డెలవరీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం పీపుల్స్ రెస్టారెంట్లు, క‌మ్యూనిటీ కిచెన్ ల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటువంటి చ‌ర్య‌ల ద్వారా కరోనాను నిలువరించడంలో యావత్ దేశానికి ఇప్పటికే కేరళ ఆదర్శంగా నిలించింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ మన దేశంలో అడుగుపెట్టినప్పుడు… కేరళలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే, అక్కడి యంత్రాంగం రేయింబవళ్లు కష్టపడి పని చేసి కరోనాను కట్టడి చేసింది. ఆ తర్వాత కేరళ కంటే ఎక్కువగా ఎన్నో రాష్ట్రాలు కరోనాతో అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుత సెకండ్ వేవ్ సమయంలో కూడా కేరళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

ఆక్సిజ‌న్ కొర‌తను అధిగ‌మించిన రాష్ట్రం

ప్ర‌స్తుతం క‌రోనా మ‌ర‌ణాల‌లో అత్య‌ధికం ఆక్సిజ‌న్ అంద‌క‌పోవ‌డ‌మే కార‌ణం. అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. మొద‌టి ద‌శ‌లో గుర్తించిన లోపాల‌ను అధిగ‌మించిన కేరళ ఆ ప‌రిస్థితి త‌లెత్త‌కుండా ప్ర‌స్తుతం ఆక్సిజన్ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. ఇప్పటికే కేరళలో 8 రోజుల పూర్తి లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్లు అందరికీ ఫుడ్ కిట్స్ ను ఉచితంగా హోం డెలివరీ చేస్తామని సీఎం విజయన్ ప్రకటించారు. సెకండ్ వేవ్ చాలా బలంగా ఉందని… అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఆహారం కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు.

కేరళలో విధించిన కొత్త కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆహారం, నిత్యావసరాలు, పళ్లు, కాయగూరలు, డెయిరీ ప్రాడక్ట్స్, మాంసం, చేపలు, జంతువుల దాణా, పౌల్ట్రీ, బేకరీలు తెరిచే ఉంటాయి. అయితే అన్ని షాపులు సాయంత్రం 7.30 కల్లా బంద్ చేయాల్సి ఉంటుంది. సీఎం పినరయి విజయన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని విజ‌య‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుతున్నాయి. లాక్ డౌన్ విధిస్తే ఆక‌లి బాధ‌లు త‌ప్ప‌వ‌న్న గుర్తించిన ఆయ‌న వాటిని తీర్చేందుకు కూడా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంపై అభినంద‌న‌లు అందుతున్నాయి.