Idream media
Idream media
స్వతహాగా రచయిత, ప్రతిభావంతుడైన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కేంద్రంలోని మోడీ సర్కారుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఒక్కోసారి వివాదాస్పదం అవుతూ ఉంటారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సరదాగా మహిళా ఎంపీలతో సెల్ఫీలకు ఫోజులిచ్చిన శశిథరూర్.. దానిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ‘మహిళా ఎంపీలు ఉండగా.. లోక్‌సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు’ అంటూ ఆయన చేసిన కామెంట్‌పై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై స్పందించిన శశిథరూర్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ట్విట్టర్‌లో కోరారు. అలాగే పలు సందర్భాల్లో సొంత పార్టీపై కూడా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే.. తాజాగా కేరళ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శశిథరూర్ వ్యవహరించడం దుమారం రేపుతోంది.
కేరళ ప్రభుత్వం, రైల్వే శాఖ జాయింట్ వెంచర్ తో కేరళలో సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ వరకు సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. గతంలో తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ కు వెళ్లాలంటే 12 గంటలు పడుతుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం నాలుగు గంటలకు తగ్గుతుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ వరకు సెమీ హై-స్పీడ్ రైలు(531 కి.మీ) ప్రాజెక్ట్ ను కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేయనుంది.
ఈ ప్రాజెక్టులో కేరళ ప్రభుత్వం (51%), రైల్వే మంత్రిత్వ శాఖ (49%) జాయింట్ వెంచర్ పనిచేయనున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 63,941 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతానికి నిధుల సమీకరణాన్ని వెల్లడించలేమన్నారని రైల్వే మంత్రి తెలిపారు. డబుల్ లైన్‌గా చేపట్టే ఈ మార్గంపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు పరుగులు తీయనున్నాయి. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన కమిటీ ప్రాజెక్ట్ నివేదికను కేరళ రాష్ట్ర మంత్రివర్గంకు సమర్పించింది. దానిని ఆమోదించిన కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
అయితే.. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల కేరళ సహజ అందాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌కు వ్యతిరేకంగా యూడీఎఫ్ ఎంపీలు కేంద్రానికి ఇవ్వడానికి ఓ లేఖను సిద్ధం చేశారు. అందులో కాంగ్రెస్ ఎంపీలు అందరూ సంతకాలు కూడా చేశారు. అయితే, దానిపై సంతకం పెట్టేందుకు శశిథరూర్ విముఖత వ్యక్తం చేశారు. దానిపై కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే ఎంపీ శశిథరూర్‌తో సహా ఎవరినైనా పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, వ్యతిరేకించే అధికారం ఎవరికీలేదన్నారు. కన్నూర్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనిపై శశిథరూర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.