iDreamPost
iDreamPost
ఓ మోడల్, నటి పుట్టిన రోజు నాడే మరణించిన సంఘటన పలువురిని కలచివేస్తుంది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మోడల్, నటి షహానా మే 12న తన 21వ పుట్టినరోజు జరుపుకుంది. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంటకు షహనా చనిపోయిందంటూ తన ఇంట్లో వాళ్ళకి ఫోన్ వచ్చింది. అయితే షహనా చావుకు ఆమె భర్తే కారణమని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తూ పోలీసులకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమె భర్త సజ్జద్ ని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. అతన్ని విచారించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. షహానా ఓ తమిళ ప్రాజెక్టులో నటించింది. దీనికి వచ్చిన పారితోషికం గురించి భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. షహానా బర్త్‌డే రోజు కూడా ఆమె భర్త సజ్జద్ ఆలస్యంగా రావడంతో మరోసారి గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అనేది విచారిస్తున్నాం అని అన్నారు.
షహానా తల్లి మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆమెని హత్య చేశారు. గతంలో కూడా చాలా సార్లు అత్తారింట్లో తనను టార్చర్ పెడుతున్నారని నాకు ఫోన్ చేసి ఏడ్చేది. ఆమె భర్త సజ్జద్ తాగొచ్చి గొడవ చేసేవాడని, అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా నా కూతురికి నరకం చూపించేవారని చెప్పేది. అయితే వేరు కాపురం పెట్టమని ఇటీవలే చెప్పాను. కానీ సజ్జద్ డబ్బు కోసం రోజు టార్చర్ పెడుతున్నాడని, ఆమె దగ్గరున్న 25 తులాల బంగారాన్ని కూడా లాక్కున్నాడని చెప్పింది. తన బర్త్‌డే రోజు మమ్మల్ని కలవాలనుకుంది కానీ కుదరలేదు, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది అంటూ భోరున విలపించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.