iDreamPost
android-app
ios-app

RBK – ఏపీ బాటలో కేరళ.. జగన్‌ ఆలోచన అమలుకు సిద్ధమైన కేరళ సర్కార్‌

RBK – ఏపీ బాటలో కేరళ.. జగన్‌ ఆలోచన అమలుకు సిద్ధమైన కేరళ సర్కార్‌

యువకుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిపాలన ఎలా ఉందో తెలిపేందుకు ఇదొక మచ్చుతునక మాత్రమే. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటే చాలు అనుభవం అవసరం లేదని నిరూపించిన వైఎస్‌ జగన్‌.. పరిపాలనలో విప్లవాత్మక చర్యలతో ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తెచ్చారు. జగన్‌ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రశంసలు దక్కడమే కాదు… ఆయా కార్యక్రమాలను అమలు చేసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా రైతులకు మేలు చేసేందుకు కేరళ కూడా ఏపీ బాటలో నడిచేందుకు సిద్ధమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) తరహాలోనే కేరళలోనూ ఆర్‌బీకేలను ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్‌బీకేల పనితీరుపై అధ్యయనం చేసేందుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్‌ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ ఏపీలో పర్యటిస్తోంది. ఆదివారం నూజివీడు మండలం తుక్కులూరులోని ఆర్‌బీకేలను సందర్శించింది. ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను పరిశీలించింది. రైతులు ఎరువులు, విత్తనాలు బుక్‌ చేసుకునేకీయోస్క్‌ యంత్రాల పనితీరును గమనించింది. బ్యాకింగ్‌ సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించింది. రైతులు పంట వేసుకున్న మొదలు.. పంట అమ్మకోవడం వరకు ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి సేవలు అందిస్తుందో కేరళ బృందం స్థానిక అధికారులను అడిగి తెలుసుకుంది.

Also Read : TN Panchayat Elections – సత్తా చాటిన నటుడు విజయ్ ఫ్యాన్స్ క్లబ్

ఏపీ సహకారం కోరతాం..

రైతు భరోసా కేంద్రాలను తమ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసే లక్ష్యంతోనే వాటి పనితీరుపై అధ్యయనం చేసేందుకు వచ్చామని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్‌ తెలిపారు. ఆర్‌బీకేల పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. కేరళలో ఆర్‌బీకేల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నామని ఆయన చెప్పారు. దేశం మొత్తం ఆర్‌బీకేల వైపు చూస్తోందన్న మంత్రి.. ఈ ఆలోచన గొప్పగా ఉందని కొనియాడారు.

పంట వేసేందుకు సిద్ధమైనప్పటి నుంచి పంట అమ్ముకునే వరకూ రైతులకు అన్ని విధాలుగా సహయ సహకారాలు అందించేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వైఎస్సార్‌ ఆర్‌బీకేలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని గ్రామాలకు చేర్చేలా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల పక్కనే.. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసింది. శాశ్వత ప్రాతిపదికన వ్యవసాయ సహాయకులను కూడా నియమించి.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట రుణాలు, బ్యాంకు సేవలు, పంట బీమా, పంట కొనుగోలు తదితర సేవలను అందిస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల వ్యాపారుల దోపిడీ, ఎరువుల కొరత, పంట అమ్మకంలో దళారుల మోసాలు, ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టపోతే పరిహారం.. ఇలా అన్ని సమస్యల నుంచి రైతులను కాపాడేందుకు ఆర్‌బీకేలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

Also Read : Municipal Elections – మినీ మున్సిపోల్‌కు రంగం సిద్ధం.. అందరి దృష్టి కుప్పం పైనే..