Idream media
Idream media
కరోనా వైరస్ తర్వాత జరిగిన పరిణామాలు బీజేపీని రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. కరోనా సమయంలో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల తాము బలంగా ఉన్నామనుకుంటున్న ఉత్తర భారత్‌లోనే బీజేపీకి భారీ నష్టం చేకూరింది. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్, కరోనా ఉపసమన చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏ మాత్రం ప్రజలను సంతృప్తిపరచడం లేదు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను రాష్ట్రాలకే వదిలేసిన కేంద్ర ప్రభుత్వం పెదరాయుడు పాత్రను పోషిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్ విధానంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియకు జాతీయ విధానం ఉండాలని, ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ మొత్తం ప్రభుత్వాల పరిధిలోనే ఉంచి, ప్రజలకు ఉచితంగా అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం ప్రైవేటుకు ఇస్తే.. ధరలు పెరగడం, బ్లాక్ మార్కెట్ విస్తరించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అసలు ఇవ్వొద్దని సూచించారు. తాజాగా జగన్ బాటలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా నడిచారు.
ప్రజలందరికీ టీకాలు ఉచితంగా అందించడం, టీకా సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కలసికట్టుగా ఒత్తిడి తెద్దామంటూ బీజేపీయేతర 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజయన్ లేఖలు రాశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రాలదేనంటూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సమాఖ్య విధానానికి విరుద్ధమని విజయన్ విమర్శించారు. టీకా కొరతను అనుకూలంగా మలుచుకుని లాభం పొందేందుకు స్వదేశీ, విదేశీ టీకా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడంలేదంటూ విజయన్ ఆరోపించారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు.. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా టీకా విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదేం టీకా విధానం అంటూ తాజాగా పలు ప్రశ్నలు సంధించింది. గతంలోనూ సుప్రిం కోర్టు టీకా విధానంపై ఇవే ప్రశ్నలు లేవనెత్తినా.. కేంద్ర వైఖరి మాత్రం మారలేదు. టీకా ధరలు వేర్వురుగా ఉండడం, టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన పెట్టడం వంటి చర్యలు ప్రజలకు ఉపయుక్తంగా లేవని సుప్రిం స్పష్టం చేసింది. ధరల నిర్ణయ అధికారం కేంద్ర పరిధిలోనే ఉండాలని చెప్పినా.. మోడీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలను క్షుణ్నంగా గమనిస్తున్న దేశ ప్రజలు.. బీజేపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఇవి అంతిమంగా బీజేపీకి రాజకీయంగా నష్టం చేకూరుస్తాయని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
Also Read : ఆ పత్రికకు ఒక వైపే కనిపిస్తుంది మరీ ..