iDreamPost
android-app
ios-app

క‌రోనా వెలుగులోకి తెచ్చిన కెన్యా “మ‌సాయి” క‌థ‌..

క‌రోనా వెలుగులోకి తెచ్చిన కెన్యా “మ‌సాయి” క‌థ‌..

క‌రోనా అంటే ఏంటో తెలియ‌ని ప‌రిస్థితుల్లోనే భార‌త‌దేశం మ‌హ‌మ్మారిని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంది. ప్ర‌పంచ‌దేశాల‌కు సైతం బాస‌ట‌గా నిలిచింది. కానీ, రెండో ద‌శ లో క‌రోనా ఉధృతికి క‌కావిక‌లమ‌వుతోంది. అప్ప‌టి వ‌ర‌కూ ఇత‌ర దేశాల‌కు ఔష‌ధాల‌ను, క‌రోనా వ్యాక్సిన్‌ను అందించి సంజీవ‌నిగా నిలిచిన‌ భార‌త్‌… ఊహించ‌ని ఉప‌ద్ర‌వానికి అల్లాడుతోంది. జెట్ స్పీడులో పెరుగుతున్న కేసులు, మ‌ర‌ణాల‌తో అట్టుడికింది. అవ‌స‌రానికి స‌ర‌ప‌డా ఆక్సిజ‌న్ , మందులు, టీకాలు స‌మ‌కూర్చుకోవ‌డంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాలు భార‌త్ కు బాస‌ట‌గా నిలిచాయి. మిగ‌తా దేశాల సాయం ఓ ఎత్త‌యితే, కెన్యా అందించిన సాయం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆఫ్రికా ఖండంలోని ఓ పేద దేశం కెన్యా. అయిన‌ప్ప‌టికీ ఆ దేశం కూడా భార‌త్ కు స‌హాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. అక్క‌డ వ్యవసాయం అతిపెద్ద రంగం. టీ, కాఫీ సాంప్రదాయ నగదు పంటలుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో 12 ట‌న్నుల ఆహార ఉత్ప‌త్తుల‌ను, టీ, కాఫీ పొడిని కెన్యా మ‌న దేశానికి పంపించింది. అంత‌కు ముందు మ‌న దేశం కెన్యాకు క‌రోనా వ్యాక్సిన్‌ను పంపించింది. ఇందుకు కృత‌జ్ఞ‌త‌గా పేద దేశ‌మైన కెన్యా త‌న వ‌ల్ల అయినంత సాయాన్ని భార‌త్‌కు అందించడంతో ఓ క‌థ ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

ప్ర‌పంచంలో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా, కెన్యా లోని మసాయు తెగ నాయకుడు స్పందించే వారు. త‌మ‌కున్న దాంట్లోనే స‌హ‌కారం అందించేందుకు త‌మ తెగ‌ను స‌మాయ‌త్తం చేసి ముందుకు సాగేవారు. 2001 సెప్టెంబ‌ర్ 11న అల్‌ఖైదా ఉగ్ర‌వాదులు అమెరికాలోని ట్విన్ ట‌వ‌ర్స్‌ కూల్చేశారు. ఇది అమెరికా ఎదుర్కొన్న అతి పెద్ద విప‌త్తుల్లో ఒక‌టి. అప్పుడు కెన్యాలోని మ‌సాయి అనే ఒక చిన్న ఆదివాసీ తెగ నాయ‌కుడు దీనిపై స్పందించి అమెరికాకు సాయం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

మ‌సాయి తెగ నాయ‌కుడు ఆ తెగ ప్ర‌జ‌ల‌తో అమెరికాలో జ‌రిగిన దాని గురించి చ‌ర్చించి త‌మ త‌ర‌పున ఏదైనా సాయం చేయాల‌ని భావించారు. అమెరికా లాంటి అగ్ర‌రాజ్యం, ఆర్థికంగా బ‌ల‌మైన దేశానికి తామేమీ సాయం చేయ‌గ‌ల‌మో చ‌ర్చించుఛకొని తాము ప్రేమ‌గా సాదుకున్న 14 ఆవుల‌ను ఇవ్వాల‌ని ఈ తెగ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నారు.

14 ఆవుల‌ను కెన్యాలోని అమెరికా ఎంబ‌సీకి తోలుకెళ్లి అప్ప‌గించారు. ఈ 14 ఆవుల‌ను అమెరికా ఏమాత్రం నామోషీ ప‌డ‌కుండా తీసుకుంది. ఒక చిన్న ఆదివాసీ తెగ త‌మ దేశం ప‌ట్ల ప్రేమ‌తో ఆవులు ఇచ్చినందున స్వీక‌రించింది. 20 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు అదే త‌ర‌హాలో భార‌త్ కు స‌హాయం అందించింది కెన్యా.