Idream media
Idream media
రబీ సీజన్‌లో బాయిల్డ్ రైస్ కొనేది లేదని.. పార్లమెంట్ లోపలా, బయట కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కానీ ఎందుకు కొనదో తేల్చుకుంటాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం కొనసాగిస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఓ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి వచ్చింది.తాజాగా మరోసారి టీఎస్ మంత్రుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. మరోవైపు రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మొత్తంగా వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం వర్సెస్ టీఆర్‌ఎస్ వార్ నడుస్తోంది. దీనికి ముగింపు ఎప్పుడనేది ఉత్కంఠగా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం వరి ప్రధాన అంశంగా కేంద్రంపై కేసీఆర్ పిలుపు ఇచ్చిన వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మరోమారు కార్యాచరణ రూపొందించిన విషయం కూడా తెలిసిందే. ఈ విషయమై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రులు హస్తినకు వెళ్లారు.ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగం కేబినెట్ ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మినిస్టర్లు కూడా అక్కడికి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో మకాం వేసిన తెలంగాణ కేబినెట్ వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది. పీయూష్ గోయల్‌తో సమావేశంలో ఆ స్పష్టత వస్తుందా లేదా చూడాలి.
మరోవైపు ఢిల్లీలో కేంద్రపెద్దలతో మంతనాలు చేస్తూనే, క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఊరేగింపులు, శవడప్పు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నిరసన కార్యక్రమాలలో భాగంగా గజ్వేల్ ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలను గ్రామగ్రామాన నిలదీయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో బీజేపీ నేతల గళ్లా పట్టుకుని అడగాలన్నారు. అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ప్రశ్నించాలని సూచించారు. బీజేపీ నేతలు సొల్లు కబుర్లు చెప్పడం మానుకుని వడ్లు కొంటరో,కొనరో సూటిగా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
కేంద్రంపై పోరాడుతూనే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని రైతులను కేసీఆర్ సర్కార్ కోరుతోంది. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు వినూత్న నిరసన కార్యక్రమాలతో తెలంగాణాని హోరెత్తిస్తున్నారు. వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో కొనసాగిన కేంద్ర ప్రభుత్వ శవయాత్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను శవపేటికపై పెట్టి చావుడప్పులతో అంతిమ యాత్ర నిర్వహిస్తూ వినూత్న నిరసన చేశారు.అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కొనసాగుతున్న కేసీఆర్ ఆందోళన పర్వానికి ఫుల్‌స్టాప్ ఎప్పుడనేది వేచి చూడాలి.
Also Read: బీజేపీలో ఏమిటీ మార్పు.. అన్నీ మెచ్చే నిర్ణయాలే