Idream media
Idream media
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెంచారు. పర్యటనలు, పరిశీలనలు, సమీక్షలతో అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ తాజాగా కేబినెట్ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతీ అంశంపై కూలంకశంగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. మంగళవారం సుమారు ఏడు గంటల పాటు సమావేశమైన కేసీఆర్.. బుధవారం అంతకన్నా ఎక్కువే పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ సమావేశం.. రాత్రి పది వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగింది.
యువతను ఆకట్టుకునేలా..
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ, భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు, 57సంవత్సరాల వారికి పెన్షన్‌తో పాటు చేనేతలకు బీమా అంశాలతో పాటు వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చ జరిగింది. మరోవైపు కృష్ణా జలాల వివాదంపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించిన సీఎం హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య నివారణ కోసం అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేశారు. అందుకు సంబంధించిన అవకాశాలను, విధివిధాలాను అన్వేషించాలని మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఏపీ మాదిరిగా జాబ్ క్యాలెండర్
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపగా.. కొత్త పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగా.. ఇకపై లోకల్ కేటగిరీలో 50శాతం సీట్లు కేటాయించనున్నారు. కొత్త జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపు జరగాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలో నెల నెలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు.
నూతన జిల్లాలు, జోన్లకు ఆమోదం
నూతన జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూతన జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఏర్పడే అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను కేబినెట్ ఆదేశించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో బుధవారం రెండోరోజు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై చర్చించారు.
సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయ పడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదంది. కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలంది. ఆ దిశగా చర్యలకు పూనుకోవాలంది. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాల నుంచి ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.
రూ.25 వేల కోట్ల పెట్టుబడి.. 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం రెండో రోజు కొనసాగింది. సమావేశంలో వ్యవసాయ శాఖపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను సీఎం నేతృత్వంలోని మంత్రివర్గం బృందం చర్చించింది. ఈ క్రమంలో భాగంగానే తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కేబినెట్ చర్చించి ఆమోదించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత మేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయం. తద్వారా సుమారు రూ. 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి మరో 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది.
ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వ ప్రోత్సాహం..
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయం. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ఎస్సీ ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయం. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇలా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్ చాలా కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.