iDreamPost
android-app
ios-app

CM KCR నీతిఅయోగ్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రిస్తున్నా, ప్ర‌ధానికి ఇది నా నిర‌స‌న‌

  • Published Aug 06, 2022 | 7:05 PM Updated Updated Aug 06, 2022 | 7:05 PM
CM KCR నీతిఅయోగ్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రిస్తున్నా, ప్ర‌ధానికి ఇది నా నిర‌స‌న‌

తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అదో నిర‌ర్ధ‌క‌మైన మీటింగ్. నీతి ఆయోగ్ సిఫార్స్ ల‌కే దిక్కులేదని, ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయం చాలా బాధాకరమే, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం ప‌ట్ల‌ నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి, నేను నా నిరసన ప్రధానమంత్రికి బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నాన‌ని చెప్పారు. దేశంలో స‌మాఖ్య స్ఫూర్తి దెబ్బ‌తింటోందని విమ‌ర్శించారు.

గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ రూ. 1. 90 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. సమాఖ్య స్పూర్తి, సహకార స్పూర్తిని పూర్తిగా దెబ్బ‌తీస్తున్నార‌ని మండిపడ్డారు.‘కేంద్రంలోని పెద్దలు ఏక్‌నాథ్‌ షిండేలను ప్ర‌తిరాష్ట్రంలోనూ సృష్టిస్తారట. ఇదేనా కో ఆపరేటివ్‌ ఫెడరలిజమంటే? ఇప్పటికైనా ప్రధాని తన బుద్ధి మార్చుకోవాలి. ఉచిత పథకాలు బంద్‌ చేయాలని అంటున్నారు. రైతులకు రైతుబంధు పథకం ఇవ్వడం తప్పా? ఉచితాలు తప్పయితే, ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారని ప్ర‌శ్నించారు సీఎం కేసీఆర్.

అస‌లు ఎన్‌పీఏల పేరుతో పెద్ద స్కామ్‌​ నడుస్తోంద‌ని, కమీషన్లు తీసుకొని ఎన్‌పీఎలు ప్రకటిస్తున్నార‌ని లెక్క‌లు చెప్పారు. ‘‘2004-05లో ఎన్పీయేలు రూ.58 వేల కోట్లు. ఇవి 2014 నాటికి 2 లక్షల 63 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇప్పుడు ఇది ఎంతో తెలుసా? 20 లక్షల 7 వేల కోట్ల రూపాయలు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇదొక దందా అయిపోయింది. ప్రభుత్వ పెద్దలు, ఎన్పీయే వాళ్లు చేతులు కలిపి పెద్ద స్కాం చేస్తున్నారు. వాళ్లు ఎన్పీయే డిక్లేర్ చెయ్యగానే, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చింది’’ అని కేసీఆర్ చెప్పారు.

రేట్లు పెరుగుతున్నాయి. పెట్టుబ‌డులు విదేశాల‌కు త‌ర‌లిపోతున్నాయి. నిరుద్యోగం ఆల్ టైం హై అని చెప్పిన సీఎం కేసీఆర్, ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు, చేనేత, శ్మశానాలపై జీఎస్టీ ఎత్తేయండి. గాలి తప్ప అన్నింటిపై జీఎస్టీ విధించార‌న్న‌ది కేసీఆర్ విమ‌ర్శ‌. అదేస‌మ‌యంలో ఇది రాజ‌కీయ ఆరోప‌ణ‌లు కాద‌ని తేల్చిచెప్పారు. మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనకు నాకు, వ్యక్తిగత విభేదాలు లేవు. దేశ ప్రగతి కోసం సంఘర్షణ తప్పద‌ని క్లారిటీ ఇచ్చారు.

‘‘దేనిపై జీఎస్టీ వేశారో కూడా మాకు తెలీదు. బయటకు వచ్చాక తెలిసింది. పాల మీద పన్ను, స్మశానాల మీద పన్ను.. ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్లనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. ఇలాగైనా మెజార్టీ ప్రజల భావాలు ప్రధానికి అర్థమవుతాయని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని కేసీఆర్ చెప్పారు.