Idream media
Idream media
ఈ మధ్యకాలంలో మోడీ మీద మాటల దాడి చేస్తున్న సీఎం కేసీఆర్ తన దాడిని మరోసారి కొనసాగించారు. ఈసారి ఏకంగా ప్రగతిభవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ మోడీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని పేర్కొన్న కేసీఆర్ అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చారు అని విమర్శించారు. ”పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు, చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ నన్నడిగితే. రోజు రోజుకు ఆ పార్టీ పరువు పోతుంది” అని ఎద్దేవా చేశారు.
”విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. కానీ విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలకు, వస్త్ర పరిశ్రమకు, పౌల్ట్రీలకు, వ్యవసాయానికి, ఎస్సీలకు ఉచిత విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. పార్టీలకు చందాలు ఇచ్చే వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. చందాలు ఇచ్చే సంస్థల సోలార్ విద్యుత్ కొనాలంటున్నారు. కృష్ణానదిపై ఆధారపడి రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. క్లీన్ ఎనర్జీ కింద సోలార్ విద్యుత్ కొనాలంటున్నారు. మన దగ్గర ఉన్న విద్యుత్ ఏం కావాలి ? వ్యాపారస్తుల కోసం రాష్ట్రాల పై భారం వేస్తారా ? ఎన్నాళ్ళు ఇలా అబద్దాలతో నడిపిస్తారు?’ బీజేపీని తరిమి కొట్టకపోతే దేశం నాశనం అవుతుంది” అని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి బడ్జెట్ నాకు అర్థం కాలేదు అంటున్నారు, కిషన్ రెడ్డి కి అర్థం కాలేదు. ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ కి కోతలు పెట్టింది నిజం కాదా ? వైద్యానికి ఎక్కువ నిధులు పెట్టలేదు నిజం కాదా ?” అని కేసీఆర్ ప్రశ్నించారు. పేరుకు విద్యుత్ సంస్కరణ… అసలు విషయం ప్రయివేటైజేషన్, కార్పొరేట్ గద్దలకు ఇవ్వడానికే ఈ ప్లాన్ అంటూ ఆరోపించారు.
”మోడీ పాలన అవినీతి కంపు, అంతర్జాతీయ మీడియా కూడా ఇదే చెప్తోంది. 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉంది, ధనికులు …ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారు. నిరుద్యోగం పెరిగింది, వాట్సప్ యూనివర్సిటీతో అబద్ధాలు, పేదలకు సబ్సిడీ ఎత్తేసి .. దొంగలకు సద్ది కట్టాలా” అంటూ ఫైర్ అయ్యారు. ”బీజేపీ ప్రభుత్వంలో 33 మంది బ్యాంక్ ను ముంచిన వాళ్ళు పారిపోయారు. పార్లమెంటులో ఈ విషయం ప్రభుత్వమే చెప్పింది. నన్ను జైల్ కు పంపుతాడట, దొంగలకు భయం… మాకేం భయం?” అని ప్రశ్నించారు. బీజేపీ అవినీతి గురించి డిల్లీలో పంచాయితీ పెడతా. రాఫెల్ జెట్ విమానాల కొనుగోలులో గోల్‌మాల్ జరిగింది, అందులో వేల కోట్లు మింగారు. మనకంటే చౌకగా ఇండోనేషియా రాఫెల్ విమానాలు కొన్నది.రాఫెల్ స్కాం పై సుప్రీం కోర్టులో కేసు వేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పు గౌరవించని ఏకైక పార్టీ బీజేపీ ఎందుకంటే గెలవకుండానే కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది అలాగే మహారాష్ట్ర లో సిగ్గు పోగొట్టుకుంది అంటూ బీజేపీ మీద ఫైర్ అయ్యారు.
”గవర్నర్ వ్యవస్థ మారాలి, దుర్వినియోగం చేస్తున్నారు, సీఎంల సమావేశానికి ఆహ్వానిస్తే ఆలోచిస్తాం. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలి, అందరు కలిసి బీజేపీ నీ ఇంటికి పంపాలి, కాంగ్రెస్ కలుస్తుందా లేదా అన్నది ముఖ్యం కాదు. అందరూ కొత్త పార్టీ అడిగితే పెడదాం, పార్టీ పెట్టే దమ్ము లేదా ? మమతా బెనర్జీ కాల్ చేశారు, బెంగాల్ రమ్మన్నారు, త్వరలో వెళ్లి చర్చిస్తా, ముంబై ఏ క్షణం ఐనా వెళతా, ఫ్రంట్ కాదు ప్రజలే ఫ్రంట్. నేను అందులో మేజర్ రోల్ ప్లే చేస్తా, ఇంట్లో కరోనా వచ్చిందని ప్రధానిని రిసీవ్ చేసుకోలేదు. ఆ విషయం ప్రధానికి చెప్పాను, రాజకీయం వేరు ప్రోటోకాల్ వేరు” అంటూ థర్డ్ ఫ్రంట్ గురించి సూచనలు చేశారు. అయితే అది థర్డ్ ఫ్రంట్ అవుతుందో? లేక కొత్త రాజకీయ పార్టీ అవుతుందో? చూడాలి.