iDreamPost
android-app
ios-app

యూపీ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌?

యూపీ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌?

ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీజేపీకి బిగ్‌ షాక్‌ ఇవ్వనున్నారా? ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారా? గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయగా, అదే బాటలో ఇప్పుడు కేసీఆర్‌ నడవనున్నారా..? తెలంగాణలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉన్న పొలిటికల్‌ వార్‌ ఆసక్తిగా మారుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా సమర శంఖారావం పూరించిన కేసీఆర్‌.. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరమే. ఇప్పటికే మూడు సార్లు ఆందోళనలకు పిలుపు ఇచ్చారు.

ఒకసారి తీవ్రస్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్న కేసీఆర్‌.. ఆపై కొన్ని రోజులు నిశ్శబ్దం పాటిస్తున్నారు. మళ్లీ అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి బీజేపీ చేస్తున్న తప్పులను ఎండగడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయ వేడి పుట్టించగానే.. అందుకు ప్రతిగా కేసీఆర్‌ కూడా వ్యూహాలు పన్నుతున్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ప్రచారం కు వెళ్తారన్న వార్తలు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌ సర్కస్‌ కంపెనీ షోలు నిర్వహిస్తున్నారని చెప్పారు. బీజేపీ సీఎంలు, జాతీయ నాయకులు సర్కస్‌ కంపెనీలో ఆర్టిస్టులు, జోకర్లుగా మారారని ఎద్దేవా చేశారు. వార్డు మెంబర్‌గా గెలవలేని బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు కూడా కేసీఆర్‌ను అవినీతిపరుడు అనడం విడ్దూరంగా ఉందన్నారు. ‘‘బీజేపీ నాయకుల చిల్లర మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించ పరుస్తున్నాయి. కేసీఆర్‌ను టచ్‌ చేస్తే. తెలంగాణ కాదు దేశమే అగ్ని గుండమవుతుంది. కాంగ్రెస్‌, బీజేపీ మెడలు వంచి 36 పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాధించిన తెలంగాణ గాంధీపైనే మీ ఆవాకులు, చేవాకులా? కేసీఆర్‌ అంటే ఏమనుకున్నారు? త్రీఫేస్‌ కరెంట్‌. ముట్టుకుంటే మాడిమసి అయిపోతారు.. ఖబడ్దార్‌’’ అని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ నేతల బండారం బయట పెడతామని హెచ్చరించారు. అవసరం అయితే తమ నేత, సీఎం కేసీఆర్‌ కూడా యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వ్యతిరేకంగా పాల్గొంటారని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్‌.. యూపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. గతంలో చంద్రబాబు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొంటున్నారు.

Also Read : యోగి సర్కారుకు మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై -ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి దెబ్బ