Idream media
Idream media
తెలంగాణ లో కొత్త శకం ప్రారంభం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేశారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. అలా కేసీఆర్ నూతన ఆలోచనా విధానాల నుంచి పుట్టిన ధరణి (సమీకృత భూ యాజమాన్య విధానం) త్వరలోనే కార్యరూపంలోకి రానుంది. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ భూములను తహసీల్దార్లు, వ్యవసాయేతర భూములైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉపయోగించే భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తో పాటే మ్యుటేషన్ కూడా చేయనున్నారు. ఈ ప్రక్రియల కోసమే ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ రూపకల్పనకు పూనుకుంది. ఇది ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది.
కేసీఆర్ సుదీర్ఘ చర్చలు
ఈ వెబ్ సైట్ రూపకల్పనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రధానంగా దీనిపై దృష్టి కేంద్రీకరించారు. నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చిస్తూ పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. విపక్షాలు లేవనెత్తిన అనుమానాలను కూడా పరిగణనలోకి తీసుకుని తుదిరూపు ఇవ్వనున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో వెబ్ సైట్ రూపొందిస్తున్నారు. గాంధీ జయంతి రోజున దీన్ని ప్రారంభించాలని కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రేపో, ఎల్లుండో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్ లకు శిక్షణ
ఈ వెబ్ సైట్ ప్రారంభానికి ముందే తహసీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్ లకు దీనిపై శిక్షణ ఇవ్వనున్నారు. కార్యకలాపాల్లో భాగంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగిన విధంగా చర్యలు తీసుకునేలా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయడానికి ఏయే అంశాలు ప్రాతిపదికగా తీసుకోవాలి..? మ‌్యుటేషన్ ఏవిధంగా జరగాలి..? దానికదే నోటీస్ ఎలా జనరేట్ అవుతుంది..? వంటి విషయాలన్నింటిపైనా శిక్షణలో చర్చించనున్నారు. ప్రారంభానికి ముందే ప్రత్యేకంగా వేసిన సాంకేతిక కమిటీలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.