Idream media
Idream media
హైదరాబాద్ లో అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో అతి పెద్ద విగ్రహం ప్రధాన ఆకర్షణగా అద్భుత ఆధ్యాత్మిక కేంద్రానికి మహానగరం వేదికైంది. ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆ మహా ఆధ్యాత్మిక క్షేత్రం గురించి ఎంత వివరించినా తక్కువే అవుతుంది.
శ్రీరామానుజాచార్యుల మహా విగ్రహ పీఠాన్ని ‘భద్రవేది’గా పిలుస్తారు. విచిత్రం ఏమిటంటే.. మహా విగ్రహంతోపాటు ఇక్కడ నిర్మాణాలను సంఖ్యా శాస్త్రం ప్రకారం నిర్మించారు. సంఖ్య, పొడవు, విస్తీర్ణాలకు సంబంధించిన అంకెలు ఏవి కూడినా చివరకు ‘9’ వస్తుంది. ఉదాహరణకు, శ్రీరామానుజుల మహా విగ్రహం ఎత్తు 216 అడుగులు కాగా ఈ మూడంకెలు కూడితే 9 వస్తుంది. ఇక, భద్రవేది ఎత్తు 54 అడుగులు. ఇందులో మూడు అంతస్తులుంటాయి. చతురస్రాకృతిలో నిర్మితమై మధ్యలో ముఖ భద్రాలతో కూడి ఒక ‘శ్రీ’ యంత్ర ఆకృతిని ఇది పోలి ఉంటుంది. ఇది 3384 అంగుళాల (282 అడుగులు) పొడవు, అంతే వెడల్పుతో ఉంటుంది. 90 స్తంభాలతో నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రవచన వేదిక ఉంటుంది. ఇక్కడే శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్రను చిత్రకళా ప్రదర్శనగా ఏర్పాటు చేశారు.
మొదటి అంతస్తులో ‘సువర్ణమూర్తి’ఇక్కడ రామానుజులు ‘సువర్ణమయ అర్చా మూర్తి’గా కొలువై ఉంటారు. దీనిని ప్రసన్న శరణాగత మండపం అని పిలుస్తారు. శ్రీరామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనుభవించినందుకు గుర్తుగా 120 కిలోల బంగారంతో 54 అంగుళాల (4.5 అడుగులు) రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇందులో 36 అంగుళాల ఎత్తైన పీఠం మీద 54 అంగుళాల ఎత్తైన సువర్ణమూర్తి కొలువై ఉంటారు. విగ్రహంపై పంచవర్ణాల విద్యుత్ దీపాలు అమర్చడంతో నిత్యం ధగధగలాడుతూ మెరుస్తుంది. ఇక్కడ స్వామికి అభిషేకం, నైవేద్యాలతో నిత్య పూజలు జరుగుతాయి. ఇందులో నక్షత్రాకృతిలో 48 స్తంభాలు; వాటిపై 32 బ్రహ్మవిద్యల శిల్పాలు కనువిందు చేస్తాయి. అలాగే, బంగారు రామానుజుల చుట్టూ ‘మకరానా’ మార్బుల్‌తో ఫ్లోరింగ్ నిర్మించారు. మిగతా ప్రాంతమంతా ఇటాలియన్ మార్బుల్స్‌తో ఫ్లోరింగ్ చేశారు. గది ప్రధాన ద్వారంతోపాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులతో తాపడాలు తొడిగారు. మొత్తం భద్రవేదిని బన్సీ పహడ్‌పూర్ పింక్ స్టోన్‌తో నిర్మించారు.
మొదటి అంతస్తులో డిజిటల్ లైబ్రరీరెండో అంతస్తులో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వానికి కృషి చేసిన మహనీయుల చరిత్రను ఇక్కడ ఉంచారు. దీనిని 16,740 అడుగుల విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. మూడో అంతస్తులో ‘పద్మపీఠం’పై విరాట్ మూర్తిమూడో అంతస్తులో రామానుజుల విగ్రహం ఉంటుంది. ఇందులో 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది. దీని చుట్టూ 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉంటాయి. అలాగే, 108 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో పీఠం ఉంటుంది. ఇందులోని ఏనుగులు తొండాల నుంచి నీటిని విరజిమ్ముతూ ఉంటాయి. పద్మపీఠంపై పాదాల నుంచి శిరస్సు వరకు 108 అడుగుల ఎత్తులో రామానుజుల విగ్రహం ఉంటుంది. శిరస్సుపై నుంచి త్రిదండం మరో 27 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ త్రిదండం మొత్తం ఎత్తు 153 అడుగులు.. కాగా బరువు 60 టన్నులు. త్రిదండంపైన ఉండే జలపవిత్రం (జెండాలాంటి ఆకృతి) 6 వేల కిలోల బరువు ఉంటుంది.
ఇంతటి విశిష్టత గల సమతామూర్తి భారీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఆవిష్కరించారు. జాతికి అంకితం చేశారు. బడ్జెట్ పై సాగిన కేసీఆర్ ప్రసంగంలో సమతామూర్తి ప్రస్తావన కూడా వచ్చింది. ఉత్తరాదిన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు గురించి ప్రస్తావిస్తూ.. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం హైదరాబాద్‌లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేస్తోన్న రామానుజాచార్య విగ్రహాన్ని సైతం బీజేపి ప్రచారానికి వాడుకుంటోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసి ఇంటి వెనకాలే ప్రధాని మోదీ రామానుజాచార్య వారి అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేయిస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో లబ్ధిపొందేలా హిందీలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య తీవ్రస్థాయిలో ట్వీట్ల వార్ నడిచింది.
ఈ క్షేత్రాన్ని చినజీయర్ స్వామి తమిళనాడులో ఏర్పాటు చేద్దామనుకుంటే.. తానే హైదరాబాద్ లో నిర్మించాలని కోరినట్లు చెప్పారు కేసీఆర్. అలాగే.. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. రెండు రోజుల క్రితమే వెళ్లి ఏర్పాట్లను కూడా పరిశీలించానని అన్నారు. అయితే శనివారం జరిగిన విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ హాజరుకాలేదు. జ్వరం కారణంగా రాలేకపోయారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంచితే.. మోడీ ఆవిష్కరించిన రామానుజచార్యుల శిలాఫలకంలో కేసీఆర్ పేరు లేదు. ఒక్క నరేంద్ర మోడీ పేరు మాత్రమే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఎందుకు లేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ కి చెందిన శిలా ఫలకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు లేకపోవడం ఎటువంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి.