Idream media
Idream media
ప్రస్తుతం గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయాలు అన్నీ హుజూరాబాద్ నియోజకవర్గం లక్ష్యంగానే జరుగుతున్నాయి. పథకాలు, వ్యూహరచనలు కూడా ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్ పదవి కూడా హుజూర్‌నగర్ వాసికి ఇచ్చి రాజకీయ చతురత ప్రదర్శించారు. హుజూరాబాద్‌కు చెందిన ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ ను చైర్మన్ గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. వారిని ఆకర్షించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా కూడా కేసీఆర్ వ్యూహ రచనలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది.
ఈటలను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెట్టిన కేసీఆర్.. బీజేపీలోకి వెళ్లిన ఆయనకు షాక్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న శ్రీనివాస్ కు కీలక పదవి కేటాయించారు. ఇప్పుడు ఈటలతో పాటు, ఆయన చేరిన బీజేపీకి సైతం మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ స్కెచ్ లు వేస్తున్నారు. ఈటల లాంటి బలమైన నేతకు చెక్ పెట్టాలంటే అలాంటి ఎలాంటి వ్యూహాలు చేయాలో కేసీఆర్ అలానే మొదలుపెడుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే..ఆయన తన అమ్ముల పొదిలో నుంచి అనూహ్యమైన అస్త్రాన్ని తాజాగా బయటకు తీశారన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు తనకు సన్నిహితుడైన మోత్కుపల్లి నర్సింహుల్నితాజాగా ప్రయోగించారన్న మాట వినిపిస్తోంది. టీడీపీకి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి బీజేపీలో చేరటం తెలిసిందే.
తాజాగా ఆయన తాను బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్లు చెప్పటమే కాదు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీద ఘాటు విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనంగా మారారు. దీంతో.. ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. గురి చూసి కొట్టినట్లుగా మోత్కుపల్లి రాజీనామాతో బీజేపీకి సైతం షాకిచ్చేలా చేశారని చెప్పాలి. సాధారణంగా బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వటమే కానీ ఎగ్జిట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువగా చెబుతారు. అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయటం ద్వారా.. కేసీఆర్ తానేమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారన్న మాట వినిపిస్తోంది.
నిజానికి మోత్కుపల్లి బీజేపీకి షాకివ్వటం ఇది రెండోసారి. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన దళిత సాధికారత పథకం సమావేశానికి బీజేపీ నేతలు ఎవరూ హాజరు కాకూడదని పార్టీ లైన్ తీసుకున్నారు. అందుకు భిన్నంగా బీజేపీ నేత హోదాలో ఆయన ఆ సమావేశానికి హాజరయ్యారు. దీనికి కమలనాథులు కస్సుమంటే.. దానికి వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత మోత్కుపల్లి మాట్లాడుతూ.. తాను దళిత ప్రజాప్రతినిధిగా వీజేపీ తరఫున హాజరు కావటం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లు అయిందని కవర్ చేస్తూనే.. దళిత సాధికారత పథకాన్ని.. సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. ఆ సమయంలోనే ముప్పును బీజేపీ నేతలు గ్రహించి ఉంటే బాగుండేది. మోత్కుపల్లిపై వేటు వేయటంతో జరిగిన జాప్యం.. తాజాగా ఆయనే పార్టీ పదవికి రాజీనామా చేయటంతో.. కమలనాథులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు. మోత్కుపల్లి తాజా ఎపిసోడ్ వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.