Idream media
Idream media
తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్‌పై టీఆర్‌ఎస్ బాస్, సీఎం కేసీఆర్ మొదటి నుంచీ సీరియస్‌గానే దృష్టి పెట్టారు. పలు సర్వేలు నిర్వహించి, వందల మందితో చర్చించి నోముల భగత్ కు టికెట్ కేటాయించిన కేసీఆర్ అతడిని గెలిపించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గెలుపుదారులను, ఎదురయ్యే అడ్డంకులను ముందుగానే గుర్తించి శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మండలాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వెంటనే లైనులోకి వెళ్తున్నారు. నాగార్జునసాగర్‌లో గెలుపే ధ్యేయంగా కేసీఆర్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ చర్యలతో టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను చూస్తున్న నేతలు అలర్ట్‌గా ఉంటున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలకు అప్పగించగా వారికి సీఎం కేసీఆర్ తరచూ ఫోన్ చేస్తున్నారు. బాధ్యతల్లో ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నారా? లేదా? ఉంటే ప్రచారంలో ఉంటున్నారా? విశ్రాంతి తీసుకుంటున్నారా? అన్న వివరాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నిఘా వర్గాలు, జీపీఎస్ ద్వారా ఎమ్మెల్యే సెల్‌ఫోన్ మూమెంట్‌ను తెలుసుకొని సీఎం లైన్‌లోకి వస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొనే అలవాటు ఉన్న నిజామాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల చెప్పా పెట్టకుండా తన నియోజకవర్గానికి వెళ్లి రెండు రోజలు ఉన్నారు. ఓ రోజు అర్ధరాత్రి సీఎం ఆయనకు ఫోన్ చేసి మందలించినట్లు తెలిసింది. దీంతో వెంటనే బయల్దేరిన ఆ ఎమ్మెల్యే తనకు కేటాయించిన నిడమనూరు మండలానికి తెల్లవారుజామున 5గంటల కల్లా చేరుకున్నారు.
ఆదిలాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యేకు ఎన్నికల డ్యూటీ వేసినా రావడానికి ఒకరోజు జాప్యం చేశారు. ఆలస్యానికి కారణమేంటని ప్రశ్నించగా వంద మంది అనుచరులను సమీకరించుకుంటున్నానని ఆ ఎమ్మెల్యే చెప్పారు. మరో ఆరు గంటల వ్యవధిలో వందమందితో వెళ్లిపోవాలని ఆదేశించడంతో ఆయన హుటాహుటిన హాలియా మండలానికి చేరుకున్నారు. స్థానికంగా సౌకర్యాలు లేవని ఓ ఇన్‌చార్జి.. సమీపంలోని మిర్యాలగూడలో నిద్రించేందుకు వెళ్లగా అర్ధరాత్రి సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తెల్లారి 3 గంటల కల్లా ఆయన సాగర్‌లోని ఎన్‌ఎ్‌సపీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరినీ పరుగులు పెట్టిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గెలిచి తీరాలన్న కసితో శ్రేణులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా హాలియా జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్, త్వరలో మరోసారి సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా సభలు, ర్యాలీలతో హడావిడి చేస్తోంది. కాగా, నాగార్జునసాగర్ బరిలో మొట్టమొదటి సారిగా 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధిక మంది పోటీలో ఉండడం ఎవరి కొంప ముంచుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : నివేదిత అలక వీడినట్లేనా ?పార్టీ మార్పు ఆగిపోయినట్లేనా ?