iDreamPost
android-app
ios-app

కేసీఆర్ ఢిల్లీ టూర్.. వారం రోజులుగా ఏం చేస్తున్నారు?

కేసీఆర్ ఢిల్లీ టూర్.. వారం రోజులుగా ఏం చేస్తున్నారు?

ఒక‌టి, రెండు, మూడు కాదు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏకంగా వారం రోజుల పాటు ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ఇప్పుడు ఇది తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. మ‌రోవైపు.. తెలంగాణ బీజేపీలో గుబులు రేపుతోంది. వ‌రుస‌గా బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుస్తుండ‌డం, రాష్ట్ర అభివృద్ధిని వివ‌రిస్తూ.. కేంద్రం స‌హాయాన్ని కోరుతుండ‌డం అంత‌టా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్రంతో సామరస్యపూర్వక వైఖరి ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారా, లేదా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారా, ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చారు. ఆ వెంట‌నే ఫెడరల్ ఫ్రంట్ అలోచనతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లో మోదితో కేసిఆర్ కు గ్యాప్ వచ్చిందన్న టాక్‌ నడిచింది. ఆ త‌ర్వాత అదే సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయ్యారు. కేంద్రంలో మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ‌తేడాది డిసెంబర్ రెండో వారంలో మ‌రోసారి మోదీని క‌లిశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రస్తావించారు. అప్పట్లో ప్రధానితో కేసిఆర్ భేటిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసిఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ వెంటనే దొరకడంపై కూడా రకరకాల చర్చలు జరిగాయి. దీంతో, రాజ్యంగబద్దంగా కేంద్రంతో ఉండాల్సిన సంబంధాలను తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని టిఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

తాజాగా మళ్లీ ప్రధానితో కేసీఆర్ భేటీపై చర్చ మొదలైంది. ఈ నెల ఒక‌టిన ఢిల్లీ వెళ్లారు. రెండో తేదీన భూమి పూజ‌లో పాల్గొన్నారు. అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా ఇత‌ర ప్ర‌ముఖుల అపాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అపాయింట్ మెంట్ దొరుకుతుందా లేదా అన్న చ‌ర్చ‌లు న‌డిచాయి. వాటి అన్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ కేసీఆర్ కేంద్ర ప్ర‌ముఖులతో వ‌రుస‌గా భేటీ అయ్యారు. ప్రధాని మోదీ స‌హా పలువురు కీలక శాఖల మంత్రులను తన అనుచరులతో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సంక్లిష్ట సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తన రాజకీయ చతురత, పరిణతిని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మైత్రీ పూర్వక సంబంధాలను కొనసాగించడం, అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన అంశాలను సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కరించుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Also Read : కాంగ్రెస్ కు ఝ‌ల‌క్ ఇచ్చిన కొండా సురేఖ‌

మ‌రోవైపు.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌స్తావ‌న కూడా వ‌స్తోంది. ఒకవైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి తొలి అడుగు వేస్తూ తమ పార్టీ జాతీయ స్థాయిలో కూడా తనదైన పాత్రను సిద్ధం చేస్తున్నార‌న్న సంకేతాలు ఇచ్చారు. హస్తినలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కెసిఆర్ కోరిన వెంటనే ఢిల్లీ పెద్దలు స్థలాన్ని మంజూరు చేయడం విశేషం. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ, అందునా దక్షిణాది నుంచి హస్తినలో పార్టీ ఆఫీస్ నెలకొల్పుకుంటున్న తొలి పార్టీ టిఆర్‌ఎస్సే కావడం..దీని వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ చాతుర్యాన్ని మెచ్చుకోవ‌చ్చు. అయితే, ఇన్ని రోజులూ కేవ‌లం బీజేపీ ప్ర‌ముఖుల‌తో భేటీ కావ‌డానికి మాత్ర‌మే కేసీఆర్ ఢిల్లీలో ఉండ‌లేద‌ని, ర‌హ‌స్యంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలు కూడా చేశార‌ని మ‌రో ప్ర‌చారం సాగుతోంది.

సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన పార్టీ కార్యాలయ భూమి పూజకే పరిమితమని తొలుత భావించినా అనూహ్యంగా ఆయన ప్రధాని మోడీని కలవడం, కేవలం రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడివున్న పది విజ్ఞప్తులతో వినతిపత్రం అందించడం, ఇదంతా చకచకా జరిగిపోవడం రాజకీయ పరిశీలకులను నివ్వెరపరిచింది. బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్రానికి వివిధ రంగాల్లో అవసరమైన ప్రతిపాదనలను కేసీఆర్ కేంద్రం ముందుంచారు. ప్రధానితో ఏకంగా 50 నిమిషాల పాటు వివిధ అంశాలను చర్చించి పర్యటనను విజయవంతం చేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన కలల ఆధ్యాత్మిక ప్రాజెక్టు యాదాద్రి ప్రారంభోత్సవానికి రావలసిందిగా మోడీని కోరారు.

కేసీఆర్ ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌లను కలిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. రాష్ట్రంలో బీజేపీతో సంబంధాలు ఎలాగున్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ ఢిల్లీలో ప్ర‌ముఖులు అంద‌రినీ క‌లిశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారాన్ని కూడా ఆయన మోదీతో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఐపీఎస్‌ల సంఖ్యను పెంచ‌డం, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికారిక భవనం కోసం స్థలం కేటాయించాల‌ని, హైదరాబాద్‌– నాగ్‌పూర్, వరంగల్‌– హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాల‌ని, గ్రామీణ సడక్‌ యోజన కింద అదనపు నిధులివ్వాల‌ని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వంద శాతం కేంద్ర నిధులతో రోడ్లు నిర్మించాల‌ని, కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాల‌ని, గిరిజన సెంట్రల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల‌ని, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాల‌ని, కొత్తగా 21 జవహర్‌ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాల‌ని.. మోదీ ముందు ప్ర‌తిపాద‌న‌లు ఉంచారు.

Also Read : సిఎం తండ్రి అరెస్ట్… సిఎం రియాక్షన్ అదుర్స్…!

తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందున ఆయా జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారుల కొరతను అధిగమించేందుకు వీలుగా ఐపీఎస్‌ కేడర్‌ను సమీక్షించి పోస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కూడా కేసీఆర్ కోరారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌రుగుతున్న జ‌ల వివాదాల నేప‌థ్యంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కూడా కేసీఆర్ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ అక్టోబర్‌ 14 నుంచి అమలయ్యేలా ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గడువు మరింత పొడిగించాలని మంత్రిని కోరారు. ఈ విషయమై తొందరపెడితే తాము నష్టపోవాల్సి వస్తుందని నివేదించారు. బ్యాంకులు, రుణ సంస్థలు రుణ వితరణ జాప్యం చేసే ప్రమాదం ఉందని నివేదించారు. వివిధ అంశాలపై చర్చలు నడుస్తున్నందున అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని వివరించారు. సమయం తక్కువగా ఉండడంతో సిబ్బంది నియామకం, వ్యవస్థ స్థాపన, తదితర సమస్యలు ఏర్పడతాయని వెల్ల‌డించారు.

మొత్త‌మ్మీద వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలోనే ఉండ‌డం రాష్ట్రంలోనే కాకుండా, దేశ వ్యాప్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కొట్లాడుతున్న క్ర‌మంలో కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇదే అదునుగా టీఆర్ఎస్ – బీజేపీ దొందూ దొందే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఢిల్లీ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ మీడియా స‌మావేశం ద్వారా పూర్తి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Also Read : ఆ నియోజకవర్గంలో అధికారపార్టీలో లోల్లి ..టీడీపీ గురి..!