iDreamPost
android-app
ios-app

Telangana CM, KCR – త‌గ్గేదేలే : కేంద్రంతో కేసీఆర్ మ‌రో విడ‌త యుద్ధం

Telangana CM, KCR – త‌గ్గేదేలే : కేంద్రంతో కేసీఆర్ మ‌రో విడ‌త యుద్ధం

ధాన్యంపై దంచుడే. కేంద్రంతో తేల్చుకునుడే.. అని సూటిగా ప్ర‌క‌టించిన కేసీఆర్ త‌న స‌మ‌రాన్ని కొన‌సాగిస్తున్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అన్నదే ప్రధాన అంశం. ఏడాది లెక్కన ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో కూడా సూటిగా చెప్పాలన్నది ముఖ్యమంత్రి ప్రధాన డిమాండ్‌. రైతు సమస్యలతో పాటు.. విభజన చట్టంలోని అంశాల అమలుపైనా ఫోకస్‌ చేస్తున్నారాయన. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల కేటాయింపులపై స్పష్టతకు, వివాదాల పరిష్కారానికి ఇంకెన్నేళ్లు కావాలంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. గ‌తంలో కూడా స్వ‌యంగా ధ‌ర్నాలో పాల్గొని కేంద్రంపై నిర‌స‌న తెలిపిన కేసీఆర్ మ‌రో ద‌ఫా కార్యాచర‌ణ ప్ర‌క‌టించారు.

టీఆర్ ఎస్ అధినేత కొంత‌కాలంగా కేంద్రప్రభుత్వం పై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. కేంద్రం తెలంగాణకు ఏమీ చేయడం లేదని.. అన్ని విషయాల్లోనూ తమకు అన్యాయమే చేస్తోందని త‌ర‌చూ విమ‌ర్శిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో.. ఓటమి తర్వాత.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు.

తెలంగాణభవన్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రుల బృందం మరోసారి హస్తిన వెళ్లనుంది. కేంద్ర మంత్రులతో పాటు, ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌నూ కోరనున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు సీఎం కేసీఆర్. చురుగ్గా పని చేయండి. మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత నాదంటూ భరోసా ఇచ్చారు. పంటల మార్పిడి పై రైతులను చైతన్య పరచాలని మిల్లర్లతో టైఅప్ ఉన్నోళ్లను వరి వేసుకోనివ్వాలని చెప్పారు. వరి వేసేవాళ్లకు రైతుబంధు ఆపాలంటూ వ్యవసాయాధికారులు చేసిన సూచనను సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుబంధుని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్ర‌తీ ఎమ్మెల్యేతోనూ మాట్లాడిన కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఏమి జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం క్రాస్ ఓటింగ్ పై సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ చేసింది, చేయించింది ఎవరో తేలాలన్నారు. అటు కేంద్రంపై పోరాటం ప్ర‌క‌టిస్తూనే.. రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు.