తెలంగాణలో బీజీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ సరికొత్త వ్యూహానికి తెరతీయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుకున్న బీజేపీ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకునేందుకు యత్నిస్తోంది. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంపై దృష్టిసారించిన కేసీఆర్,
రైతు ఉద్యమంతో తొలి అడుగు వేశారు.
కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా జాతీయ పార్టీలకు లేదని, అది కేవలం ప్రాంతీయ పార్టీల వల్లే అవుతుందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన కేసీఆర్ కాన్సంట్రేషన్ ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలపై పడింది. గ్రేటర్ ఎన్నికల్లో వైఫల్యం తరువాత తన పోరాటాన్ని బీజేపీపై ఎక్కుపెట్టారు కేసీఆర్. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ 8న జరగనున్న భారత్ బంద్ లో పాల్గొనాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు 12వ రోజుకు చేరాయి. రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతుల పోరాటానికి అండగా నిలవడానికి టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరముందని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులో ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులోనూ వ్యతిరేకించిన టీఆర్ఎస్ ఇప్పడు క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతోంది. బీజీపీని ఎదుర్కొనేందుకు వ్యవసాయ చట్టాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కూడా టీఆర్ఎస్ దృష్టిసారించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో విజయం సాధించవచ్చనే వ్యూహాన్ని టీఆర్ఎస్ అనుసరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్డీయే, యూపీఏ లకు ప్రత్యా్మ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జి, డీఎంకే అధినేత స్టాలిన్ తోనూ సంప్రదింపులు జరిపారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు. బల్దియా ఎన్నికల తరువాత హైదరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో భారీ సదస్సును నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ నుంచే బీజేపీకి పతనానికి నాంది పలుకుతామని ప్రకటించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పీఠాన్ని కదిల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, కేంద్రంలో బీజేపీ కుర్చీని కదిల్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. త్వరలోనే కర్ణటక మాజీ సీఎం కుమార స్వామితో కూడా బేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో పాటు యూపీలో అఖిలేశ్ యాదవ్, బీహార్ లో తేజస్వి యాదవ్, కర్ణాటకలో కుమారస్వామి, తమిళనాడులో స్టాలిన్ తదితరులను ప్రత్యామ్నాయ కూటమిలో భాగం చేస్తారనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో మొదలైన టీఆర్ఎస్, బీజేపీ వార్ జాతీయ స్థాయి పోరుగా పరిణామం చెందుతుందా? లేదా అనేది వేచి చూడాలి.