Idream media
Idream media
ఈ నెల 14వ తేదీతో ముగుస్తున్న లాక్‌డౌన్ ఆ తర్వాత కూడా కొనసాగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరో రెండు వారాలు (ఏప్రిల్ 30 వరకు) పాటు లాక్‌డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బతికి ఉంటే బలుసాకు తిని బతకొచ్చన్న కేసీఆర్.. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే తర్వాతైనా బాగుచేసుకోవచ్చన్నారు. మానవజాతి మనుగడ కోసం దేశ ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
బీసీజీ ద్వారా నివేదిక తెప్పించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్ జూన్ 3 వరకూ కొనసాగించాలని సదరు సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. లేదంటే పరిస్థితి అమెరికా, యూరప్‌లా మారుతుందని సదరు సంస్థ తెలిపిందన్నారు. అందుకే లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినా.. తెలంగాణలో మాత్రం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కష్టమో, నష్టమో 21 రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టుకున్నామని, ఇప్పుడు వైరస్ నియంత్రణలోకి రాకముందే ఎత్తివేస్తే.. ఆ కష్టం అంతా వృథా అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వైకుంఠపాళి మాధిరిగా మొత్తం పరిస్థితి మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాముద్ధీన్ ఘటన లేకపోతే తెలంగాణ ఆరాంగా ఉండేదన్నారు. అది 300 కేసులను అంటగట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. నిజాముద్దీన్ లింక్ కనిపెట్టడం కష్టమవుతోందన్నారు. అక్కడికి వెళ్లి వచ్చిన వారు ఇంకా ఎంత మందికి అంటించారో తెలియదన్నారు. లింక్ కట్ చేయడం వల్లనే వైరస్‌ను అరికట్టగలమని కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడిపై ప్రతి రోజు తాను ప్రధాని మోదీతో మాట్లాడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.
వ్యవసాయ రంగానికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గోతాములు కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీతోనూ మాట్లాడుతున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగం పరిస్థితి ఏమిటో అంచనా వేస్తున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనప్పుడు పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వడం సహజమన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంపై కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. ముందు బతికి ఉంటే.. ఏమైనా చేయొచ్చన్నారు.
Read Also : విలక్షణం.. కందుకూరు రాజకీయం..! ఆ రెండు కుటుంబాల మధ్య పోటీ ముగిసినట్లే..!!