iDreamPost
android-app
ios-app

మాగంటి మీద జిల్లా భారం,బాధ్యతలు

మాగంటి మీద జిల్లా భారం,బాధ్యతలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాషాయ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌.. దొందూ దొందే అంటూ నగరంలోని ఓ వర్గాన్ని ఆకట్టుకుంటూ బలోపేతం అవుతోంది. ప్రస్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో అన్ని స్థానాలనూ చేజిక్కించుకునేలా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో తగిన ప్రాతినిథ్యాన్ని సంపాదించి బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్‌లో, ముఖ్యంగా హైదరాబాద్‌ జిల్లాలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ఉన్న బలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఆ బాధ్యతలు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై పడ్డాయి. ఎందుకంటే.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఆయన నిమితులయ్యారు.

తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ ఇంచార్జిలను నియమించింది. గ్రేటర్‌ స్థానంలో హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాకు ఇంచార్జిలను నియమించింది. హైదరాబాద్‌ జిల్లా ఇంచార్జిగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ నియమితులయ్యారు. పార్టీని నడిపించే సమర్ధత, కార్యకర్తల బాగోగులు చూసుకునే సమర్ధ నాయకత్వం కోసం పార్టీ మొదటి అన్వేషిణ మొదలుపెట్టింది. పోటీ చేసిన రెండు మార్లు కూడా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్‌ తన పనితీరుతో అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ పగ్గాలు పట్టుకున్నారు. నగరంలో జన్మించిన మాగంటి గోపీనాథ్‌ ఇక్కడే రాజకీయ అడుగులు వేశారు.

ఇంతకుముందు టీఆర్‌ఎస్‌కు సంబంధించి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడి నియామకం ఉండగా.. ఇప్పుడు జిల్లాకే పరిమితం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును గ్రేటర్‌ అధ్యక్షుడిగా నియమించారు. గ్రేటర్‌/జిల్లాకు సంబంధించి ఆ తరువాత పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరుగలేదు. దీర్ఘకాలం అనంతరం మాగంటి గోపినాథ్‌కు జిల్లా బాధ్యతలు అప్పగించారు.

హైదర్‌గూడలో జన్మించిన మాగంటి గోపీనాథ్‌ అప్పటి సీఎం దివంగత ఎన్‌టి రామారావు పై అభిమానంతో 1983లో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి నగర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. ఆయన 1985 నుంచి 92 దాకా తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987,1988లో హుడా డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో మొదటి సారిగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2015,2016 టీటీపీ గ్రేటర్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

రాష్ట్రంలో కొంత కాలంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎదురే లేదనుకున్న అధికార పార్టీకి బీజేపీ, కాంగ్రెస్‌లు గట్టి సవాల్‌ విసురుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ రెండు పార్టీలు బలంగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే కమిటీల నియామకంపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పార్టీ బాధ్యతలు ఎమ్మెల్యే, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న మాగంటికి అప్పజెప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.