iDreamPost
android-app
ios-app

గురి చూసి కొడుతున్న కేసీఆర్‌

గురి చూసి కొడుతున్న కేసీఆర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు కనిపిస్తున్నాయి. గ్రేటర్‌ జోష్‌తో రాష్ట్రం అంతా పట్టుపెంచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఆ దిశలోనే ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా ఇతర నేతలు అందరూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ సైతం వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. మాటలు మాని చేతల ద్వారా ప్రజల మద్దతు మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తునట్లుగా ఉంది. ఏయే ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత ఉందో తెలుసుకుని వాటిని వరుసగా సరిదిద్దుతూ పోతున్నారు. ఆయా వర్గాలలో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిపై గురిపెట్టి వాటిని చక్కదిద్దుతున్నారు. ఇప్పటికే నియంత్రిత్వ సాగుపై వెనక్కి తగ్గారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేశారు. రిజిస్ట్రేషన్లు కూడా పాత విధానంలోనే చేసుకోవచ్చునని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఉద్యోగుల మనసు కూడా దోచుకుంటున్నారు.

వ్యతిరేకత నుంచి సానుకూలత

ఉద్యోగులందరూ ప్రభుత్వంపై వ్యతిరేక భావనతో ఉన్నట్లుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ ఓట్ల ద్వారా నిర్దారణ అయింది. దీంతో ఆ వ్యతిరేకతను సానుకూలతగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్‌ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. వారికి వేతనాలను, ఉద్యోగ విరమణ వయసును పెంచుతామని, పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారు. నిరుద్యోగులకూ ఫిబ్రవరిలో ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని తీపి కబురు చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, సెర్ప్‌, ఆర్‌టీసీ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, విద్యా వాలంటీర్లు ఇలా ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. నూతన సంవత్సర కానుకగా మొత్తం 9,36,976 మందికి వేతనాలు పెరగనున్నట్లు వెల్లడించారు. జీతాల పెంపుపై మంగవారం ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. వేతన సవరణ సంఘం ఇవ్వబోయే నివేదిక ఆధారంగా ఎంత పెంచాలో నిర్ణయం తీసుకొనేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.

ఉద్యోగ సంఘాలతో సమావేశం

ఈ కమిటీ జనవరి రెండో వారంలో ఉద్య్గోగ సంఘాలతో సమావేశమై జీతాల పెంపు, రిటైర్మెంట్‌ వయసుపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల సిబ్బందికి వేతనాలు పెంచామని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వానికున్న ఆర్థిక పరిమితులకు లోబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని, త్రిసభ్య కమిటీ ఉద్యోగ నేతలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీతో వివాదాలు పరిష్కారం అయినందున పోలీసు, రెవెన్యూ సహా అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలని చెప్పారు. అన్ని శాఖల్లో వెంటనే శాఖాపరమైన పదోన్నతుల కమిటీలను వేయాలన్నారు. పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. అలాగే ‘‘నాలుగో తరగతి ఉద్యోగి నుండి శాఖాధిపతి వరకు ఎవరైనా సరే పదవీ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం జరపాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలి. రిటైరైన రోజే రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అన్నీ అందించాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండవద్దు’’ అని కేసీఆర్‌ అన్నారు.