నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలలో టీఆరెస్ అభ్యర్థిగా స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత అనూహ్యంగా బరిలోకి దిగడంతో ఆమెకు పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని బరిలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు టీపిసిసి అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు. స్వతహాగా నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల్లో అధికార టీఆరెస్ పార్టీకి ఆధిక్యం ఉండడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయని అందరు భావించారు. అయితే ఇప్పుడు బిజెపి, కాంగ్రేస్ పార్టీలు తన అభ్యర్దులను రంగంలోకి దించడంతో పోటీ తప్పేలా లేదు.
కాంగ్రెస్ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నియోకవర్గానికి చెందిన పీసిసి కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ని బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆయన ఎల్లారెడ్డి తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ గా కూడా వ్యవహరించారు. బిజెపి అభ్యర్థిగా పి లక్ష్మినారాయణ పోటీలో ఉన్నాడు. గతంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా వున్న భూపతి రెడ్డి పార్టీ ఫిరాయిపుల నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవి కోల్పోవడంతో మిగిలిన ఈ రెండేళ్ల కాలానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత రంగంలోకి దిగడంతో టీఆరెస్ కార్యకర్తల్లో నూతనుత్తేజం నెలకొందని చెప్పవచ్చు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా మూడు రోజులు గడువు ఉండడంతో చివరివరకు ఎంతమంది బరిలో నిలబడతారో చూడాలి.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత కవితా గత కొంతకాలంగా టీఆరెస్ రాజకీయాలకు దూరంగా ఉండడంతో జిల్లా టీఆరెస్ నేతలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి జిల్లా రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో టీఆరెస్ కార్యకర్తలు అనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల్లో మొత్తం ఓటర్లు 824 మంది ఉండగా వీరిలో 550 మందికి పైగా టీఆరెస్ కి చెందిన వారే. దీంతో ఆమె గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో త్వరలో కేసీఆర్ క్యాబినెట్ లో కవితకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది.