iDreamPost
android-app
ios-app

గుంటూరు మేయర్‌ పీఠంపైనే గురి..!

గుంటూరు మేయర్‌ పీఠంపైనే గురి..!

15 ఏళ్ల తర్వాత అంటే వైసీపీ ఆవిర్భావం తరువాత తొలిసారి జరుగుతున్న గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే పల్లెపోరులో గుంటూరు జిల్లాలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. అదే ఉత్సాహంతో తొలిసారిగా గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ ఇక్కడా తన జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది. ఇక్కడ ఫలితాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల మాట.

15 ఏళ్ల తర్వాత ఎన్నికలు

1994లో గుంటూరు కార్పొరేషన్‌ ఏర్పడగా ఆఖరిసారిగా 2005లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలుకాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. మేయర్‌ పదవిని కన్నా నాగరాజు రెండున్నరేళ్లు, రాయపాటి మోహనసాయికృష్ణ రెండున్నరేళ్లు పంచుకున్నారు. ఆ తర్వాత గుంటూరు శివారు ప్రాంతాల్లోని 10 గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో నాటినుంచి నేటి వరకూ ప్రత్యేకాధికారుల పాలనలోనే కాలం వెల్లదీస్తుంది.

టీడీపీలో నాయకత్వ లోపం

గుంటూరు కార్పొరేషన్‌ మేయర్‌ పీఠంపై పాలకపక్ష, ప్రతిపక్ష పార్టీలు గురిపెట్టాయి. 2005లో కాంగ్రెస్‌ చేతిలో ఓటమిపాలైన టీడీపీ ఈ సారి ఆ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. అయితే ఇక్కడ పార్టీ నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆ పార్టీకి మేయర్‌ పీఠం అందని ద్రాక్షలాగానే మిగలనుందని విశ్లేషకుల భావన. ఎంపీ గల్లా జయదేవ్‌ మాత్రమే అప్పుడప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు ఇక్కడకు వచ్చి తిష్ట వేసినా స్థానికులను ఆకట్టుకోలేకపోతున్నారు.

మద్దాళి గిరి ప్రభావమెంత?

2019 ఎన్నికల్లో గుంటూరు  పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాళి గిరిధరరావు ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ముస్తాఫా గెలిచారు. దీంతో తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ఇద్దరూ మేయర్‌ పీఠం వైసీపీకి దక్కేలా గట్టి కృషి చేస్తున్నారు. మద్దాళి గిరిధరరావు వైసీపీలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఎక్కువగా మమేకమవుతున్నారు. పార్టీ చేస్తున్న పథకాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైసీపీ విజయంలో ఆయన కీలకపాత్ర పోషించనున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.

మేయర్‌ రేసులో ఆ ఇద్దరు..

గుంటూరు మేయర్‌ రేసులో వైసీపీ అభ్యర్థులు కావటి మనోహర్‌ నాయుడు, పాదర్తి రమేష్‌ గాంధీ ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు. గుంటూరు కార్పొరేషన్‌లో ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఈ సామాజిక వర్గాలే కీలకభూమిక పోషిస్తుంటాయి. దీనికోసం వ్యూహాత్మకంగా వీరిద్దరూ చెరో రెండున్నరేళ్ల పాటు పదవిని పంచుకోనులే వైసీపీ రాష్ట్ర నాయకులు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఒప్పందం చేశారు. అయితే మొదట ఎవరు, తర్వాత ఎవరు అనేది మాత్రం అధినేత జగన్‌ నిర్ణయానికే వదిలేశారు.

కావటికే మొదటి చాన్స్‌?

కావటి మనోహర్‌ నాయుడు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనను పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా జగన్‌ నియమించారు. మూడేళ్లపాటు ఆయన ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.ఎన్నికల ముందు నంబూరి శంకర్ రావ్ కు పెదకూరపాడు ఎమ్మెల్యే టికెట్ దక్కగా ఆయన గెలిచారు.

2019 ఎన్నికల్లో మనోహర్‌ నాయుడుకు గుంటూరులో పార్టీ విజయంలో కీలకభూమిక పోషించినట్లు అధిష్టానం గుర్తించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌తో ఆయనకు సానిహిత్యం ఉండడం కూడా కలిసొచ్చే అంశం. దీంతో ఆయనకే తొలి రెండున్నరేళ్లు మేయర్‌గా అవకాశం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.