Idream media
Idream media
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనే సామెత.. మొన్నటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌషిక్ రెడ్డి తీరునకు అతికినట్లు సరిపోతుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కౌషిక్ రెడ్డి చూపిస్తున్న అత్యుత్సాహం ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టడడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన సవాల్ కౌషిక్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది. హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదన్నారు కౌషిక్ రెడ్డి. అంతటితో ఆగితే సమస్య ఉండేది కాదు.. కానీ యార్కర్ సంధించాలనుకున్నాడో ఏమో గానీ ఈ మాజీ క్రికెటర్.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కౌషిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 61,121 ఓట్లు సంపాదించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్య పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ సారి కూడా కాంగ్రెస్ తరఫున కౌషిక్ రెడ్డినే పోటీ చేస్తారనుకున్నారు. అయితే ఈటల వెళ్లిపోవడంతో.. టీఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్థి కరువయ్యారు. ఈ సమయంలో కౌషిక్ రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని టిక్కెట్ ఇస్తుందనే ప్రచారం సాగింది. కౌషిక్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో ఉండగానే.. టీఆర్‌ఎస్ టిక్కెట్ తనకే వస్తుందంటూ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడారు. కొన్ని రోజుల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ప్రకటించిన కేసీఆర్.. గవర్నర్ ఆమోదం కోసం కూడా పంపారు. అయితే ఆ ఫైల్ నెలలుగా అక్కడ పెండింగ్‌లోనే ఉంది.
Also Read : హుజురాబాదులో నాలుగు ‘ఈ’ల కలవరం
లెక్కలు తారుమారైతే..
కాంగ్రెస్‌కు డిపాజిట్ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడం వెనుక కౌషిక్ రెడ్డి ధీమాకు కారణం ఏమిటోగానీ.. హుజురాబాద్‌లో ఓట్ల లెక్కలు చూస్తే మాత్రం ఆయనకు చిక్కులు తప్పేట్లు లేవు. గత ఎన్నికల్లో హుజురాబాద్‌లో పోలైన ఓట్లును పరిశీలించే కౌషిక్ రెడ్డి ఈ సవాల్ చేశారా..? లేదా..? అనే అనుమానం రాక మానదు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికి హుజురాబాద్‌లో 2,09,338 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 1,76,723 (84.42 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో అప్పడు టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు 1,04,840 (59.34 శాతం), కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌషిక్ రెడ్డికి 61,121 ఓట్లు (34.60 శాతం) బీజేపీకి 1683 (095 శాతం) నోటా 2867 (1.62 శాతం) ఓట్ల చొప్పన ఓట్లు పోలయ్యాయి. మిగిలిన ఓట్లు స్వతంత్రులకు దక్కాయి.
ఈ గణాంకాలు చూస్తే.. గత ఎన్నికల నాటికి అక్కడ బీజేపీ బలం నామమాత్రమే. ఇప్పుడు ఈటల బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి.. ఆ పార్టీ గెలుపు రేసులో ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీ తరఫున ఈటల హోరాహోరీగా తలపడుతున్నారు కాబట్టి గెలుపు అవకాశాలు ఆ రెండు పార్టీలకే ఉన్నాయనుకున్నా.. కాంగ్రెస్‌ను మరీ తీసిపారేయలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ బలమైన సామాజికవర్గానికి చెందిన వాడు. ఆర్థికంగా స్థితి మంతుడు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతగా ఉన్న అతను.. పోటీ చేస్తున్న తొలి ఎన్నికలను అంత సులువగా తీసుకుంటారనుకోలేం. గెలుపు కోసం కష్టపడతారు. గెలవకపోయినా ఫర్వాలేదు గానీ డిపాజిట్ కోల్పోతే అటు రేవంత్ రెడ్డికి, ఇటు బల్మూరు వెంకట్‌కి ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడుతుంది.
Also Read : కోమటిరెడ్డి బ్రదర్స్ పై బీజేపీ చూపు?
గత ఎన్నికల్లో 2,09,338 ఓట్లకు గాను 84.42 శాతం పోలయ్యాయి. ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది కాబట్టి 90 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే 1,88,404 ఓట్లు పోలవుతాయి. డిపాజిట్ రావాలంటే మొత్తం పోలైన ఓట్లలో 6వ వంతు ఓట్లు రావాలి. అంటే 1,88,404 ఓట్లలో 31,338 ఓట్లు వస్తే.. అభ్యర్థులకు డిపాజిట్ దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకోవాలంటే ఆ పార్టీకి 31,338 ఓట్లు రావాలి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లలో ఈ మొత్తం సగం మాత్రమే. ఎన్నికలు టీఆర్‌ఎస్, ఈటల అనేలా జరిగినా.. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు ఎలాగూ ఉంటుంది. ఆయా ఓట్లకు తోడు.. బల్మూరు వెంకట్ కొంత కష్టపడితే.. డిపాజిట్ రావడం కష్టమేమీ కాదు. అదే జరిగితే.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతున్న కౌషిక్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఏం జరుగుతుందో నవంబర్ 2న వెల్లడయ్యే ఫలితాల్లో తేలుతుంది.