iDreamPost
android-app
ios-app

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకాంతాచారి తల్లి.. కారణమిదే

  • Published Jan 03, 2024 | 11:29 AMUpdated Jan 03, 2024 | 1:01 PM

తెలంగాణ మలిదశ పోరాటంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ వివరాలు..

తెలంగాణ మలిదశ పోరాటంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ వివరాలు..

  • Published Jan 03, 2024 | 11:29 AMUpdated Jan 03, 2024 | 1:01 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శ్రీకాంతాచారి తల్లి.. కారణమిదే

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని బలంగా కోరుకుని.. ఆశయ సాధన కోసం ఉద్యమంలోకి దూకాడు శ్రీకాంతాచారి. ఈ క్రమంలో 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ.. చివరకు డిసెంబర్ 3, 2009న తుది శ్వాస విడిచాడు. అగ్నికి అహుతవుతూ కూడా జై తెలంగాణ అంటూ నినదించాడు. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఏంటంటే.. శ్రీకాంతాచారి తల్లి.. శంకరమ్మ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మంగళవారం నాడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయానికి వెళ్లిన ఆమె.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి.. శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వీరిద్దరి మీటింగ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. అమరులు, ఉద్యమకారుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ శంకరమ్మకు కీలక పదవి ఇవ్వనుంది అనే వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ వ్యూహం ఇదే..

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు.. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి చట్టసభలకు పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా బీఆర్ఎస్ గవర్నమెంట్ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుని.. అండగా నిలిచిందనే సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. అంతేకాక ఎన్నికలకు ముందు.. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అందులో భాగంగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు తీసుకునే అప్లికేషన్ ఫారాల్లో.. వారి కోసం ప్రత్యేకంగా ఓ కాలం పెట్టారు కూడా. అమరులు, ఉద్యమకారులు తమ కేసుల వివరాలు వెల్లడిస్తే.. ప్రత్యేకంగా ఇండ్లు కేటాయించటంతో పాటు అమరుల కుటుంబాలకు పింఛన్లు కూడా మంజూరు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది.

అమరుల ప్రతినిధిగా శంకరమ్మను చట్టసభలకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా.. గవర్నర్ లేదా ఎమ్మెల్యేల కోటాలో ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి.. అసెంబ్లీ ఎన్నికల ముందే ఆమెకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆమె అప్పటి సీఎం కేసీఆర్‌తో సైతం భేటీ అయ్యారు. ప్రభుత్వ వాహనం, పీఏను సైతం కేటాయించటంతో శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి కచ్చితంగా ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. చివరకు ఆమెకు పదవి ఇవ్వలేదు.

గతంలో పోటీ చేసి ఓటమి..

వాస్తవంగా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు తర్వాత.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మ హుజూర్‌నగర్‌ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2018 తర్వాత వచ్చిన ఉప ఉపఎన్నికల్లో ఆమెను పక్కకు పెట్టి ఎన్‌ఆర్ఐ సైదిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను పలుమార్లు కోరారు. వివిధ వేదికలపై తనతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని శంకరమ్మ బహిరంగంగానే ప్రకటించారు.

ఈ క్రమంలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమెను చట్టసభలకు పంపి.. అమరుల పక్షాన నిలిచేది హస్తం పార్టీ అని ప్రచారం చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయనుందని రాజకీయ పండితులు అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా శంకరమ్మకు పదవి ఇస్తుందో లేదో అంటున్నారు ప్రజలు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి