Idream media
Idream media
అది 1999 నాటి సినిమా. అయినప్పటికీ అందులోని పాత్రలు, సన్నివేశాలు చాలామందికి గుర్తు ఉంటాయి. ఎందుకంటే.. అంతలా ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమాలో రైతు వేషధారణలో ఉన్న ఇద్దరు ఓ కారు షోరూమ్ లోకి వెళ్లి ఓ కారును తాకుతూ పరిశీలిస్తుంటారు. ఇంతలో సేల్ మేనేజర్ వచ్చి..
ఏ..యే.. చేతులు తీయండయ్యా.. అంటాడు.
అయితే కాలెడదాం.. అని కాలు వేస్తారు.
కాలు తీయండి కాలు తీయండి..
ఏం కావాలి మీకు.. అని సేల్స్ మేనేజర్ అడుగుతాడు.
ఈ బండి చూడ్డానికి చాలా బాగుంది రేటెంతేంటి? అని రైతులు అడిగితే..
చూడ్డానికి రేటు లేదు కానీ.. చూసి ఎళ్లండి.. అని ఎటకారంగా చెప్పి వాళ్లను పంపించేయాలని వాచ్ మన్ కు చెబుతాడు.
అంతటితో ఆగకుండా ఇదేమైనా గేదెల వ్యాపారం అనుకున్నారా.. రేటూ లేదు గీటూ లేదు వెళ్లండి.. అంటాడు.
ఆ రైతులు గట్టిగా అడిగేసరికి ఎయిట్ లాక్స్.. ఎనిమిది లక్షలు.. అని చెబుతాడు సేల్స్ మేనేజర్.
ఎనిమిది లచ్చలా అని ఆ రైతులు నవ్వుకుంటుంటే.. ఆ ఎనిమిది లక్షలే మీరేం కొంటారు వెళ్లండి అంటాడు. ఇంతలో చిన్నయ్యా.. మనమంటే ఏంటో ఇతనికి చూపించు.. అని మరో రైతు వేషధారణలో ఉన్న వ్యక్తికి చెప్పగానే.. అతను ఆటోలో ఉన్న మూట పట్టుకురా అని డ్రైవర్ కు చెబుతాడు. అతడు తేగానే మూట విప్పి కిందకు పొయ్.. అంటాడు. ఆటో డ్రైవర్ విసుగ్గా మూట విప్పి కింద పోయగానే..
అందులోంచి నోట్ల కట్టలు బయటపడతాయి. వాటిని చూసి సేల్స్ మేనేజర్ సహా అందరి కళ్లూ బైర్లు కమ్ముతాయి.
ఇప్పటికే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అది స్నేహం కోసం సినిమాలోని సన్నివేశం అని. సరిగ్గా అలాంటి ఘటనే కర్ణాటకలో కూడా చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌కి కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. ఆ రైతు ఆ షోరూమ్‌లోని సేల్స్‌మేన్ చేత అవమానింపబడ్డాడు. అతని వేషధారణ చూసిన సేల్స్‌మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని వెటకారంగా చెప్పాడు. పైగా నీ జేబులో కనీసం రూ. 10 కూడా ఉండకపోవచ్చు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కెంపెగౌడని చాలా అవమానించి మాట్లాడాడు.
దీంతో ఆ సేల్స్‌మేన్‌కి రైతు కెంపెగౌడకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ మేరకు రైతు మాట్లాడుతూ…”నేను ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువస్తే గనుక నువ్వు ఎస్‌యూవీ కారుని ఈ రోజే డెలివరీ చేయాలి” అని సేల్స్‌మేన్‌కి ఒక చాలెంజ్ కూడా విసిరాడు. ఈ క్రమంలో రైతు సినిమాలోని హీరో మాదిరిగా ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువచ్చి సేల్స్‌మేన్‌కి చూపించాడు. దీంతో సేల్స్‌మేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ సేల్స్‌మేన్ వెంటనే డెలీవరీ చేయడంలో విఫలమయ్యాడు, ఎందుకంటే వెయిటింగ్ లిస్టింగ్ ఉంటుంది కదా.
చివరలో మరో ట్విస్ట్..
రైతు కెంపెగౌడ ఒక్కసారిగా ఆ సేల్స్‌మేన్ పై మండిపడటమే కాక అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకు ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ వీడియోని విస్తృతంగా ట్వీట్ చేశారు.