iDreamPost
iDreamPost
కర్నాటకలో హిజాబ్(బుర్ఖా) వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం నాడే ఒక కళాశాలలో మొదలైన ఈ వివాదం క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరిస్తోంది. మత ఉద్రిక్తతలు రేపుతోంది. ముస్లిం విద్యార్థినులకు బుర్ఖాలు ధరించే అవకాశం ఇస్తే.. తమకు కాషాయ కండువాలు ధరించేందుకు అనుమతించాలని మరో వర్గానికి చెందిన విద్యార్థులు డిమాండ్ లెవనెత్తడంతో వివాదం మొదలైంది. చివరికి పార్లమెంటుకు, హైకోర్టుకు కూడా చేరింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని విద్యాలయాలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.
ఉడుపి కళాశాలలో మొదలు
ఉడుపి లోని ఉమెన్స్ ప్రీ యూనివర్సిటీ కళాశాల విద్యార్థినులు జనవరి ఒకటో తేదీన హిజాబ్ లు ధరించి రావడాన్ని మిగతా విద్యార్థులు వ్యతిరేకించారు. కళాశాల ప్రిన్సిపల్ రుద్రగౌడ కూడా హిజాబ్ తో క్లాసులకు రావడానికి అనుమతి నిరాకరించారు. విద్యాసంస్థల్లో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా అందరూ యూనిఫాం ధరించాలని స్పష్టం చేశారు. తమకు బుర్ఖాలతో హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ముస్లిం విద్యార్థినులు కళాశాల వద్ద ధర్నా చేశారు. దానికి ప్రతిగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసన తెలిపారు. వివాదం క్రమంగా జటిలం అవుతుండటంతో జనవరి 19న కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులతో సమావేశం నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు.
ఇతర జిల్లాలకు వ్యాప్తి
ఈ వివాదం సద్దుమణగకపోగా ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వ్యాపిస్తోంది. ఉడుపితోపాటు మంగళూరు, శివమొగ్గ, దావణగేరె, తదితర జిల్లాల్లోని విద్యాలయాల్లోనూ హిజాబ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రదర్శనలు, ఆందోళనలు జోరందుకున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై గత 26న విచారణకు హై లెవల్ కమిటీని నియమించింది. ఆ నివేదిక వచ్చేవరకు అన్ని విద్యాసంస్థల్లోనూ యూనిఫామ్ నిబంధనలు అందరూ పాటించాలని ఆదేశించింది.
రేపు హై కోర్టు విచారణ
ఇదే తరుణంలో కళాశాలకు చెందిన కొందరు ముస్లిం విద్యార్థులు హై కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అని.. ఆ మేరకు న్యాయం చేయాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగం పౌరుల మత విశ్వాసాలకు రక్షణ కల్పిస్తోందని, హిజాబ్ తో తరగతులకు హాజరుకావడానికి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. దాన్ని మంగళవారం విచారణకు స్వీకరించిన కోర్టు బుధవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. భావోద్వేగాలకు తావు లేకుండా చట్ట ప్రకారం విచారణ నిర్వహిస్తామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరోవైపు పార్లమెంటులోనూ ఈ అంశం సోమవారం ప్రస్తావనకు వచ్చి బీజేపీ, ఇతర పార్టీల మధ్య వాగ్వాదాలకు దారితీసింది.
Also Read : విభజన కష్టాలు ఏడేళ్లుగా పరిష్కరించలేకపోయారా మోదీజీ?