Idream media
Idream media
హిజాబ్ (అంటే ఏంటో చివర్లో చదవగలరు..) ధరించి ఓ విద్యార్థిని కాలేజ్‌కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన కొందరు విద్యార్థులు అడ్డుకున్నారు. యువతి తన స్కూటర్‌ను పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అంటూ నినదించారు. కర్ణాటకలోని ఓ ప్రభుత్వ కళాశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత.. చాలా కాలేజీల్లో ఈ వివాదం మొదలైంది. ఈమధ్య ఓ కాలేజీలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను విడిగా కూర్చోబెట్టిన ఘటన కూడా వివాదాస్పదమైంది. దీనిపై కర్ణాటకలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మంగళవారం కూడా కర్ణాటకలోని రెండు జిల్లాల్లో హిజాబ్ వివాదం హింసకు దారితీసింది. ఉడిపిలోని ఓ కళాశాలలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్‌లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించవచ్చా లేదా అనే అంశంపై న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై విచారణ కూడా జరిగింది. దీనిపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగబద్దంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి.
హిజాబ్ అంటే ఏంటంటే..
ముస్లిం మహిళలు బురఖా ధరించడం సంప్రదాయంగా వస్తోంది. బురఖా తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుంది. కళ్ళపై ఒక వీల్ ఉంటుంది. హిజాబ్ అంటే ఒక తెర లాంటిది. హిజాబ్ తో మహిళలు తమ జుట్టును మాత్రమే కప్పుకుంటారు. మహిళలు తల, మెడను ఏదైనా క్లాత్‌తో కప్పి ఉంచడాన్ని హిజాబ్ గా పేర్కొంటున్నారు. హిజాబ్ ధరించిన వారి ముఖం కనిపిస్తుంది. హిజాబ్ వస్త్రధారణ తో ఎప్పటి నుంచో యువతులు బయటకు వస్తున్నారు. అనూహ్యంగా కర్ణాటకలో దీనిపై వివాదం మొదలైంది.
Also Read : కర్నాటకలో ముదురుతున్న బుర్ఖా వివాదం.. మూడు రోజులు విద్యాసంస్థల మూసివేత