iDreamPost
android-app
ios-app

భవన నిర్మాణ కూలీ అయ్యాడు టాపర్

భవన నిర్మాణ కూలీ అయ్యాడు టాపర్

కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా నుండి బెంగళూరుకు వలస వచ్చిన కట్టడ కార్మికుల కుటుంబానికి చెందిన మహేష్ అనే విద్యార్థి కర్ణాటక పదవ తరగతి పరీక్షలలో 616/625(98%) మార్కులు సాధించాడు. బెంగళూరులోని జీవన్ బీమా నగర్ లోని కర్ణాటక పబ్లిక్ స్కూల్లో మహేష్ చదువుతున్నాడు. కార్మికుడిగా పనిచేస్తూనే అత్యధిక మార్కులు సంపాదించిన మహేష్ కు అన్ని వైపులా ప్రశంసలు దక్కుతున్నాయి. కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ స్వయంగా మహేష్ ఉంటున్న ప్రదేశానికి వచ్చి  మహేష్ ,వారి కుటుంబాన్ని అభినందించారు…

మంగళవారం ఉదయం, ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య మంత్రి ఎస్. సురేష్ కుమార్ మహేష్ ఉంటున్న గుడిసెను సందర్శించారు, అక్కడ మహేష్ తన తల్లి మల్లమ్మ మరియు ఇద్దరు తోబుట్టువులతో కలిసి నివసిస్తున్నాడు. మహేష్ ను అభినందించిన మంత్రి సురేష్  సత్కరించి ₹ 5,000 అందజేశారు. కాగా మహేష్ ను అభినందించి సత్కరించటంతో పాటు మూడ్బిద్రిలోని ఆల్వాస్ కాలేజీలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ మహేష్ కు హామీ ఇచ్చారు.

విద్యాశాఖ మంత్రి తన ఇంటిని సందర్శించడంతో మహేష్ ఆనందం వ్యక్తం చేశాడు. తన ఇంటికు మంత్రి వస్తారని అస్సలు అనుకోలేదని తనకి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని,వారివల్లే నేను అత్యధిక మార్కులు సాధించానని వెల్లడించాడు.  భవిష్యత్తులో టీచర్ కావడమే తన లక్ష్యం అని మహేష్ మీడియాకు తెలిపారు..

కాగా భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ టాపర్ గా నిలిచిన మహేష్ పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. సోషల్ మీడియా వేదికగా మహేష్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.