Idream media
Idream media
ఒకప్పుడు కక్షలు, కార్పణ్యాలు, ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన అనంతపురం జిల్లా రాప్తాడులో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు వెల్లివిరుస్తున్నాయి. పోలాల్లో జలాలు పారుతున్నాయి. ప్రముఖ కంపెనీల ఏర్పాటుతో యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే పరిస్థితి నెలకుంటోంది. ఎమ్మెల్యే అయిన రెండేళ్లలోనే పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.. ఒకప్పుడు రక్తం పారిన రాప్తాడులో నీళ్లు పారించారు. పాత ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయించుకుని వాటికి శంకుస్థాపనలు చేశారు. తద్వారా వ్యవసాయానికి బంగారు బాటలు వేశారు.
వ్యవసాయంతోపాటు చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించేలా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బెంగుళూరుకు సమీపంగా ఉన్న రాప్తాడులో కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రకాశ్‌రెడ్డి ఇటీవల ఆయా కంపెనీల ప్రతినిధులతో బెంగుళూరులో చర్చలు జరిపారు. జూలై నెలలో ప్రకటించిన నూతన ఐటీ పాలసీ వల్ల ఆయా కంపెనీలకు వచ్చే ప్రయోజనాలను వివరించారు. ఇందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహకరించారు. రాప్తాడులో ఐటీ టవర్‌లు ఏర్పాటు చేయడం వల్ల బెంగుళూరుతో పోల్చుకుంటే నిర్వహణ వ్యయం తగ్గడంతోపాటు.. ఏపీ ప్రభుత్వం అందించే రాయితీల ద్వారా తమ వ్యాపార అభివృద్ధి జరుగుతుందని విశ్వసించిన కార్బన్ మొబలై కంపెనీ.. రాప్తాడులో హార్మోని సిటీ పేరుతో ఐటీ టవర్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది.
బెంగుళూరు కేంద్రంగా మొబైల్ కంపెనీని ఏర్పాటు చేసిన కార్బన్.. గోల్డెన్ గ్లోబ్ కంపెనీ పేరుతో హార్మోని సిటీ బ్రాండ్‌తో పారిశ్రామిక వాడల్లో సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తోంది. రాప్తాడులో హార్మోని సిటీ ఏర్పాటుపై కార్బన్ మొబైల్ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ సుధీర్ అసిజా, గోల్డెన్ గ్లోబల్ కంపెనీ ఎండీ రవికుమార్‌లు ఇటీవల తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ ప్రతిపాదనను వివరించారు. కంపెనీ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, ఐటీ పాలసీ ప్రకారం రావాల్సిన రాయితీలు సకాలంలో ఇస్తామని సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.
హార్మోని సిటీ పేరుతో నిర్మించే ఈ ఐటీ టవర్లకు అక్టోబర్‌లో శంకుస్థాపన చేయబోతున్నారు. విజయదశమి సందర్భంగా కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 120 ఎకరాల విస్తీర్ణంలో హోర్మోని సిటీ ఏర్పాటు కాబోతుంది. అనంతపురం నుంచి బెంగుళూరుకు వెళ్లే జాతీయ రహదారిలో కుడివైపున ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు. హార్మోని సిటీ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు, పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.
Also Read : చంద్రబాబును కలవరపెడుతున్న గల్లా..!