Idream media
Idream media
రాజకీయ కర్ణాటకం సుఖాంతమైంది. యడియూరప్ప రాజీనామా చేయడమే కాదు.. కొత్త ముఖ్యమంత్రి ప్రకటన కూడా జరిగిపోయింది. నేడు ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. కర్ణాటక కొత్త సీఎం బసవరాజ సోమప్ప బొమ్మై(61).. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఆర్. బొమ్మై కుమారుడనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఫిరాయింపులతో అధికారం కోల్పోతే.. నేడు యడియూరప్ప పై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కొడుకు చేతికి అధికారం వచ్చింది.
కర్నాటకలో 1988 ఆగస్టు 13, 1989 ఏప్రిల్ 21 మధ్య కాలంలో జనతాదళ్ సర్కార్ ఉండేది. ముఖ్యమంత్రిగా ఎస్.ఆర్. బొమ్మై ఉన్నారు. పెద్దఎత్తున పలువురు పార్టీ నాయకులు ఫిరాయింపులు జరపడంతో బొమ్మై ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. అందువల్ల ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నామని అప్పటి కేంద్రం పేర్కొంది. అయితే రాజ్యాంగంలోని 356 అధికరణం కింద ఆ ప్రభుత్వాన్ని గవర్నర్ డిస్మిస్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించారు. ఎస్. ఆర్ బొమ్మై నాడు తన బలం నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. పెద్దఎత్తున పలువురు పార్టీ నాయకులు ఫిరాయింపులు జరపడంతో బొమ్మై ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, అందువల్ల ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నామని అప్పటి కేంద్రం పేర్కొంది.
తన మద్దతుకు సంబంధించి జనతాదళ్ లెజిస్లేచర్ పార్టీ ఆమోదించిన తీర్మాన కాపీని బొమ్మై అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినప్పటికీ అసెంబ్లీలో బలనిరూపణకు ఆయనకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ దాన్ని తిరస్కరించారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బొమ్మై మొదట కర్ణాటక హైకోర్టుకెక్కారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేయడంతో.. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై తీర్పునిచ్చేందుకు అత్యున్నత నాయస్థానానికి ఐదేళ్లు పట్టింది. 356 ఆర్టికల్ కింద రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ రద్దుకు ఆ తీర్పు స్వస్తి చెప్పింది. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు అసలైన వేదిక శాసనసభేనని, అంతే తప్ప గవర్నర్ సొంత అభిప్రాయానికి తావు లేదని స్పష్టం చేసింది.
ఎస్.ఆర్. బొమ్మై వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బసవరాజ్ ఇప్పుడు కర్ణాటక సీఎం కుర్చీ ఎక్కబోతున్నారు. పార్టీలోను, ముఖ్యమంత్రిపైన బయటపడ్డ అసంతృప్తుల నేపథ్యంలో అనూహ్యంగా సీఎం కుర్చీ బసవరాజ్ ను వరించింది. జనతాదళ్ (యూ)లో ఉన్న బసవరాజ్.. 22 మందితో కలిసి 2008లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత యడియూరప్పకు దగ్గరయ్యారు. ఈయన కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే. ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. యడియూరప్ప కూడా బసవరాజ్ కే మద్దతు పలికారు.