iDreamPost
android-app
ios-app

కాపు ఉద్యమం.. జగన్, చంద్రబాబు ఎవరు ఎలా వ్యవహరించారు..?

  • Published Feb 03, 2022 | 11:27 AM Updated Updated Feb 03, 2022 | 11:27 AM
కాపు ఉద్యమం.. జగన్, చంద్రబాబు ఎవరు ఎలా వ్యవహరించారు..?

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో చేర్చాలని చంద్రబాబు పాలనా కాలంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన కాపు ఉద్యమం… ఉద్యమ నాయకత్వం వహించిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని… అతని కుటుంబాన్ని… ఉద్యమకారులను వేేేధింపులకు గురి చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో పెట్టిన అక్రమ కేసులు అన్నీఇన్నీకావు. వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు విడతలుగా నాటి చంద్రబాబు పెట్టిన కేసులు ఉపసంహరించుకోవడం ఆ వర్గీయుల్లో సంతోషాన్ని నింపింది. ఇదే సమయంలో ఉద్యమం పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. 

రాష్ట్రంలో మెజార్టీ జనాభా ఉన్న వర్గాల్లో కాపులు ఒకరు. కాపులు, బలిజ, తెలగ, ఒంటరి కలిసి తమను బీసీల్లో చేర్చాలని సుదీర్ఘకాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్‌ పునరుద్దరించాలని వారు కోరుతున్నారు. దీనిపై పలు సందర్భాలలో ఉద్యమాలు జరిగాయి. 1989 ఎన్నికల ముందు దివంగత నేత కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్యమం తరువాత 2016లో అతి పెద్ద ఉద్యమం చోటు చేసుకుంది. 2014 ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్‌ ఇస్తానని నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారు.

ఆ హామీని నెరవేర్చమని బాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు గళం విప్పారు. రిజర్వేషన్‌ సాధనే లక్ష్యంగా ముద్రగడ నేతృత్వంలో జనవరి 31వ తేదీన తునిలో ‘కాపు ఐక్య గర్జన’ జరిగింది. నాటి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే పనుల్లో భాగంగా తుని సమావేశాన్ని భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కాని ఆ సభ విజయంవంతమైంది. అయితే కొంతమంది గుర్తు తెలియని దుండగులు రత్నాచల్‌ రైలును దగ్ధం, తుని పోలీస్ స్టేషన్‌ మీద దాడి చేశారు. దీనిపై అటు రైల్వే పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు కేసు పెట్టారు. కాపుల రిజర్వేషన్‌ కోసం తరువాత ముద్రగడ తన కుటుంబంతో కలిసి ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా గ్రామాల్లో ఆ సామాజికవర్గం వారు రాస్తారోకో, రిలేదీక్షలు, ఆమరణదీక్షకు కూర్చున్నారు. వారి మీద కూడా కేసులు పెట్టారు.

ముద్రగడ ఉద్యమ సమయంలో ఆయన, ఆయన కుటుంబం మానసికంగా కృంగిపోయేలా పోలీసులు ఇబ్బందులు పాల్జేశారు. ముద్రగడను రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించి నిర్బంధించారు. పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆర్మీ కాపలా తరహాలో వేలాది మంది పోలీసులను మోహరించి, బారికేడ్లు, ఐరెన్‌ గ్రిల్‌ ఏర్పాటు చేశారు. ఉద్యమ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు వంటి నేతలను అరెస్టు చేసి సబ్‌ జైల్లో వేశారు. తరువాత కూడా పలు సందర్భాలలో కాపు ఉద్యమం పట్ల చంద్రబాబు ప్రభుత్వం అణిచివేత విధానాన్నే అవలంభించింది. అయితే ఎన్నికల ముందు కేంద్రం అగ్రవర్ణాల పేదలకు పదిశాతం ఇచ్చిన రిజర్వేషన్‌లో కాపులకు ఐదుశాతం కేటాయించినట్టు జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ వర్గానికి తాను ఎంతో చేశానని చెప్పుకొచ్చారు.

కాపులకు రిజర్వేషన్‌ సాధ్యం కాదని, కాని వారి కోసం ఏర్పాటు చేసిన కాపు కార్పోరేషన్‌కు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని పాదయాత్రలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే టీడీపీ ప్రభుత్వ హాయాంలో కాపుల మీద పెట్టిన కేసులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీల మేరకు 2016 నుంచి 2019 వరకు సాగిన రిజర్వేషన్‌ ఉద్యమంలో పాల్గొన్నవారి మీద రాష్ట్ర వ్యాప్తంగా 161 కేసులు నమోదు చేశారు. ఈ కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ బుధవారం జీవో జారీ చేశారు. దీని వల్ల కాపు వర్గీయుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పలువురు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆడిన మాటకు కట్టుబడి జగన్‌ కాపులకు రాజకీయంగాను, ఆర్థికంగా చేయూతనందిస్తున్నారని పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : కాపు ఉద్యమ కేసులు ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం