iDreamPost
android-app
ios-app

గొర్రెల ప‌థకం మంచిదే కానీ…

గొర్రెల ప‌థకం మంచిదే కానీ…

జ‌గ‌న్ కొత్త‌గా కాప‌రి బంధు ప‌థ‌కాన్ని తెస్తున్నాడు. ఉచితంగా గొర్రెల్ని ఇవ్వ‌డం కంటే ఇది కొంచెం మెరుగైందే కానీ, అధికారులు దీన్ని నీరుకార్చ‌కుండా చూసుకోవాలి. ఎందుకంటే దేశంలో గొర్రెలు-బ‌ర్రెలు ప‌థ‌కం అంత‌ ప్ర‌హ‌స‌నం మ‌రొక‌టి లేదు. వెనుక‌టికి త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత పాడి ఆవుల ప‌థ‌కం పెట్టింది. సొంత రాష్ట్రంలో కొనుగోలు చేస్తే ఆవులు చేతులు మార‌డం త‌ప్ప పాడి అభివృద్ధి ఉండ‌ద‌ని, పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేయాల‌ని నిబంధ‌న పెట్టారు.

దాంతో నాట‌కం మొద‌లైంది. కుప్పం సంత‌కు త‌మిళ‌నాడు అధికారులు , ల‌బ్ధిదారులు వ‌చ్చేవాళ్లు. కొంత మంది రైతులు ఆవుల్ని తీసుకుని వ‌చ్చేవాళ్లు. వాళ్ల ఆధార్‌కార్డు వివ‌రాలు తీసుకుని అధికారులు కొనుగోలు చేసి ప‌త్రాల మీద సంత‌కాలు పెట్టించుకునేవాళ్లు. ల‌బ్ధిదారుల‌కి ఇచ్చి ఫొటోలు తీసుకునే వాళ్లు. త‌ర్వాత రైతులు కొంచెం డ‌బ్బు తీసుకుని త‌మ ఆవుల్ని తోలుకెళ్లే వాళ్లు. అధికారులు , ల‌బ్ధిదారులు ప్ర‌భుత్వ సొమ్ముని పంచుకుని తినేవాళ్లు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఉచిత గొర్రెల ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టింది. ల‌క్ష‌ల గొర్రెలు పంచారు. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో గొర్రెల పెంపకందారుల జీవితాలు మారిపోయిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ గొర్రెలు ఏమ‌య్యాయో తెలియ‌దు. అందుకే రెండో విడ‌త జోలికి వెళ్ల‌డానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం జంకుతోంది.

ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఇదే జ‌రుగుతుంది. గొర్రెలు కాగితాల మీద చేతులు మారుతాయి. 1.50 ల‌క్ష‌ల్లో 30 శాతం అంటే 45 వేల‌లో ల‌బ్ధిదారుల‌కి కొంచెం ఇచ్చి, అధికారులు కొంచెం తినేస్తారు. గొర్రెల‌తో జీవితాల్లో కొత్త క‌ళ అనే హెడ్డింగ్‌తో సాక్షిలో ల‌బ్ధిదారుల ఇంట‌ర్వ్యూలు, అధికారుల వ్యాఖ్యానాలు వ‌స్తాయి. త‌ర్వాత ఈ ప‌థ‌కం ఎవ‌రికీ గుర్తు ఉండ‌దు.

ఆశ‌యం మంచిదే అయినా, ఆచ‌ర‌ణ కూడా మంచిగా ఉండాలి.