Idream media
Idream media
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులైన అనంతరం మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయారు. సోము బాధ్యతల స్వీకరణలో కన్నా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి వీర్రాజుతో కలిసి పని చేస్తానని, పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కానీ, పార్టీ సమావేశాల్లో మినహా, కార్యక్రమాలు, ఆందోళనల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అధ్యక్షుడి అయిన తర్వాత ఏపీ బీజేపీ నుంచి సోము ఒక్కరే చక్రం తిప్పుతున్నారు. కానీ చాన్నాళ్లకు కన్నా లైన్ లోకి వచ్చారు. ఏపీ యూనిట్ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి రాజకీయంగా క్రియారహితంగా ఉన్న కన్నా ఆదివారం తొలిసారిగా రెండు గంటల ధర్నా నిర్వహించారు. కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఈ ధర్నా చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన సారథ్యంలో ఏపీలో ఏ ఒక్క ఎన్నికలోనూ బీజేపీ మెరుగైన ప్రదర్శన చేయలేదు. తెలంగాణలో బండి సంజయ్ నిరూపించుకోగా.. ఏపీలో సోము వీర్రాజుకు ఇంకా గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో మళ్లీ పాత నాయకులు తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్ళీ ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుండి తొలగించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ గా ఉన్నాడు. కానీ, ఆదివారం వైసీపీకి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో ఆయనతో పాటు మరి కొంతమంది ఇతర నాయకులు పాల్గొన్నారు.
విశేషం ఏంటంటే, ఆదివారం జరిగిన కార్యక్రమంలో సోము వీర్రాజు కన్నా.. కన్నా లక్ష్మీ నారాయణే కాస్త ఎక్కువ మాట్లాడారు. కరోనా నియంత్రణపై జగన్ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేదంటూ విమర్శలు వ్యక్తం చేశారు. అనూహ్యంగా కన్నా లైన్ లోకి రావడం, కాస్త ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయడంపై బీజేపీ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది.