Idream media
Idream media
ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మదుసూదన్ యాదవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఊహించని బహుమతి ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్టు మెంబర్‌గా ఆయన్ను నియమించారు. బోర్టు సభ్యుల జాబితాలో ఆయన పేరు ఉండడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల ఉన్నాయి. అందులో 8 చోట్ల వైసీపీ గెలిచింది. అద్దంకి, చీరాల, కొండపి, పర్చూరుల్లో టీడీపీ గెలిచింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో రెడ్డి, వైశ్య, ఎస్సీ, చౌదరి సామాజికవర్గాలకు చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. అయితే వీరెవరికీ దక్కని టిటిడి బోర్డు మెంబర్ పదవి.. మొదటిసారి గెలిచిన బుర్రా మధుసూదన్ యాదవ్‌కు ఎలా దక్కింది..?
బాలినేని అండ..
వైసీపీ ముఖ్యనేత, ఒంగోలు ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండ బుర్రా మధుసూదన్ యాదవ్‌కు పుష్కలంగా ఉంది. రెండు పర్యాయాలు కనిగిరి సీటు బుర్రా మధుసూదన్‌కు దక్కడంలో బాలినేనిదే కీలక పాత్ర. రెడ్డి సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న కనిగిరిలో బీసీ సామాజికవర్గ నేతకు ఇవ్వడంపై విమర్శలు వచ్చినా.. బుర్రాకు టిక్కెట్ దక్కింది.
Also Read : ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. ఏం జరగబోతోంది?
ఘన విజయం.. అవినీతికి దూరం..
కొండపి నియోజకవర్గం టంగుటూరుకు చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్.. బిల్డర్. బెంగుళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. 2014లో బీసీ కోటాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండతో కనిరిగి టిక్కెట్ దక్కింది. స్థానికేతరుడు కావడం, ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు కొత్తవడం, 2009లో నామినేషన్ చెల్లకపోవడంతో టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుకుపై ఉన్న సానుభూతి వల్ల.. 7,107 ఓట్ల వ్యత్యాసంతో బుర్రా మధుసూదన్‌కు ఓటమి తప్పలేదు.
ఓడిపోయినా పట్టువదలకుండా 2014 – 19 వరకు ఐదేళ్లు నియోజకవర్గంలో తిరిగారు. స్థానికేతరుడు అనే విమర్శ మళ్లీ రాకుండా.. కనిగిరిలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒకే భవనంలో కింద పార్టీ కార్యలయం, పైన నివాసం ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ నిర్థేశించిన కార్యక్రమాలతో ప్రతి గ్రామానికి వెళ్లారు. కార్యకర్తల మెప్పు పొందారు. దీనికి తోడు.. జగన్ హవా కూడా కలవడంతో కనిగిరి చరిత్రలో మునుపెన్నడూ లేని మెజారిటీ 40,903 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ప్రతిపక్షంలో ఉన్నంత కాకపోయినా.. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఓ వైపు వ్యాపారాలకు, మరో వైపు ఎమ్మెల్యే బాధ్యతలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గడిచిన రెండేళ్ల నాలుగు నెలల కాలంలో అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలు మధుసూదన్‌పై రాకపోవడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గర ఆయనకు మంచి మార్కులు రావడానికి దోహదపడింది.
Also Read : సచివాలయంలో పెరుగుతున్న సందడి, అమాత్యుల హడావిడి ఆరంభం